
పెత్తందార్లకు ముచ్చెమటలు పట్టించా
● పేదలకు భూములు పంచాం
● సాయుధ పోరాట యోధురాలు రంగక్క
నేరేడుచర్ల: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తుపాకి పట్టి పెత్తందార్లను హడలెత్తించిన ధీరవనిత రంగక్క. ఆమె ఆసలు పేరు కొణిజేటి సత్యావతి అయినప్పటికి రంగక్కగానే పోరు భూమికి సుపచిరితం. 99 ఏళ్ల రంగక్క ఉద్యమ జీవితం గురించి ఆమె మాటల్లోనే..
సాయుధ పోరాటంలో నేను ఒక దళానికి కమాండర్‌ని. నల్ల మల్ల అడవుల్లో నాలుగేళ్ల పాటు రహస్య జీవితం గడిపాను. అచ్చంపేట, అమ్రాబాద్ చుట్టుపక్కల ఊర్లను పెత్తందార్ల నుంచి విడిపించాం. పద్మానపల్లిలో పేదోళ్లు పండించిన ధాన్యమంతా భూస్వామి ఎరుకల నాగమ్మ ఇంట్లో పెట్టుకుందని తెలిసి ఆమెకు తుపాకీ చూపించి పేదలకు ధాన్యం పంచాం. పల్లెల్లో దొరలు, దేశ్‌ముఖ్‌ల భూములను పేదలకు పంచాం.
అడవిలోనే నా వివాహం..
ఆనాటి కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ నాయకుడు కొణిజేటి నారాయణ నాగర్‌కర్నూల్ ప్రాంతంలో మరో దళానికి కమాండర్. ఆయన సొంతూరు నేరేడుచర్ల మండలం పెంచికల్‌దిన్నె. ఆయన కన్నా ముందే నేనే అడివిలోకి వచ్చినా అక్కడ ఒకరికి ఒకరం పరిచయమయ్యాం. మేమిద్దరం వివాహం చేసుకోవాలని పార్టీ పెద్దలందరూ ప్రతిపాదించారు. అమ్రాబాద్ అడవుల్లోనే కొండమీద వివాహం చేసుకున్నాం. మాది కులాంతర వివాహం. నా భర్త కొణిజేటి నారాయణ రెండు సార్లు సర్పంచ్‌గా గెలిచారు. ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయన ఐదారేళ్లు క్రితం మరణించారు.
ఆంధ్రాలో పురుడు పోసుకున్నా..
నేను గర్భవతిగా ఉన్నప్పుడు గుంటూరులోని పార్టీ నాయకుడి బంధువుల ఇంట్లో ఉంచారు. కొంతకాలం నర్సరావుపేటలో ఉండి, నెలలు నిండే సమయానికి ఒంగోలుకు మకాం మార్చాం. అక్కడే ఓ ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చాను. బాబుకు మూడు నెలలు వచ్చే వరకు ఒంగోలునే ఉన్నా. తర్వాత పిల్లాడిని భుజాన వేసుకుని తిరిగి నల్లమల్లకు చేరుకున్నాను. సాయుధ పోరాటం విరామం తర్వాత ఒకరోజు ఆత్మకూరులో రైతు సభకు వెళ్లిన నన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తమ పార్టీ నాయకుల ఆచూకీ చెప్పాలని పోలీసులు హింసించారు. నాపై 9 కేసులు బనాయించారు. ఏడాదిన్నర పాటు జైలు జీవితం గడిపాను.
నేను చచ్చిపోయా అనుకున్నారు..
ఒక రోజు నల్లమల్లలో పోలీసులు నన్ను చుట్టుముట్టారు. ఆ సమయంలో దళం సభ్యులమంతా చెల్లాచెదురయ్యాం. ఆ రోజంతా అడవిలోనే ఒంటరిగా తలదాచుకొని తెల్లవారాక ఓ చెంచుగూడేనికి చేరుకున్నా. నా కాళ్లకు గాయాలయ్యాయి. వారందరు తిరిగి నన్ను మంచిగా చేశారు. నా జాడ తెలియక నేను చనిపోయాననుకున్నారు. ఆ తర్వాత గూడెం వాళ్ల ద్వారా నేను బతికాను అని లోకానికి తెలిసింది. నాకు ఆరుగురు కుమారులు సంతానం. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే కుమారుల వద్ద ఉంటున్నా.
నన్ను మహబూబ్‌నగర్ జైలులో ఏడాదిన్నర పాటు నిర్భందించారు. అక్కడ మరో 30 మంది ఆడవాళ్లు ఖైదీలుగా ఉండగా.. మా అందరికీ వారానికి ఒక్కటే సబ్బు ఇచ్చేవారు. దీంతో తోటి ఖైదీలను సమాయత్తం చేసి జైలులోనే ఉద్యమించాను. అప్పుడు జైలర్ దిగివచ్చి ఒక్కొక్కరికి నెలకు సరిపడా సబ్బులు, రోజుకు ఒక బకెట్ వేడి నీళ్లు ఇచ్చారు. ఆ తర్వాత చంచల్‌గూడ జైలుకు పంపించారు. అక్కడ ఆరు నెలలు శిక్ష అనుభవించా. అప్పుడు నా పెద్ద కుమారుడు జ్యోతిబాబుకు రెండేళ్లు. వాడు కూడా నాతో పాటే జైలులో ఉన్నాడు.

పెత్తందార్లకు ముచ్చెమటలు పట్టించా