
యూరియా కొరత దేశవ్యాప్తంగా ఉంది
నల్లగొండ: యూరియా విషయంలో రైతులను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని బీఆర్‌ఎస్ పార్టీ చూస్తోందని నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని మంత్రి కోమటిరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చైనా నుంచి సరఫరా తగ్గిపోవడం వల్ల తెలంగాణలోనే కాదు దేశ వ్యాప్తంగా యూరియా కొరత ఏర్పడిందన్నారు. కేంద్రం నుంచి యూరియా వస్తే రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని పంపిణీ చేస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం చైనాతో ప్రధాని మోదీ మాట్లాడారని దాంతో యూరియా దిగుమతి జరుగుతుందన్నారు. త్వరలోనే సమస్య పూర్తిగా పరిష్కారమవుతుందన్నారు. గతేడాది ఇదే సీజన్‌లో నల్లగొండ జిల్లాలో 57 వేల మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేస్తే ఈ సంవత్సరం ఇప్పటికే 61 వేల మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అందించామన్నారు. 4 వేల మెట్రిక్ టన్నుల యూరియా ఈ సీజన్‌లో అధికంగా పంపిణీ చేశామన్నారు. బీఆర్‌ఎస్ నేతలు అధికారుల వద్దకు పోయి వివరాలు తీసుకుని మాట్లాడాలి కానీ, రాజకీయ లబ్ధి కోసం రైతులను రెచ్చగొట్టడం సరైంది కాదన్నారు. ఈసారి జిల్లాలో 5.68 లక్షల ఎకరాల్లో పత్తి, 5.35 లక్షల ఎకరాల్లో వరి సేద్యం చేశారని, దానికి అనుగుణంగా యూరియాలో ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే గన్‌మెన్ యూరియా పక్కదారి పట్టించారనడంలో వాస్తవం లేదని ఎంపీ రఘువీర్ స్పష్టం చేశారు. ఈ సంఘటనపై తాను కలెక్టరేట్‌లో కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడానని, వారు ఈ సంఘటనపై విచారణ చేసి ఎలాంటి పొరపాటు జరగలేదని తేల్చినట్లు ఎంపీ పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, కాంగ్రెస్ పార్టీ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, అబ్బగోని రమేష్, వంగూరి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
రైతులను బీఆర్‌ఎస్ రెచ్చగొట్టి లబ్ధిపొందాలని చూస్తోంది
మిర్యాలగూడ ఎమ్మెల్యే గన్‌మెన్ యూరియాను పక్కదారి పట్టించారనడంలో వాస్తవం లేదు
నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి