
అద్భుతం.. కాల్వ నిర్మాణం
పెన్‌పహాడ్: పెన్‌పహాడ్ మండలం దోసపహాడ్ గ్రామ శివారులో మూసీ నదిపై సాగర్ ఎడమ కాల్వ నిర్మాణం ఇంజనీర్ల అద్భుతమైన ప్రతిభకు గొప్ప నిదర్శనం. సాధారణంగా నదిపై ఆనకట్ట కట్టి నీటిని నిల్వ చేస్తారు. కానీ ఇక్కడ నదిపై నుంచి కాల్వ ప్రవహించేలా ఇంజనీర్లు నిర్మాణం చేపట్టారు. 1955–60 మధ్యన మూసీ నది పైనుంచి 50 అడుగుల ఎత్తులో 32 కానాలతో సాగర్ కాల్వను రాతి కట్టడంతో నిర్మించారు. దీని ద్వారా సాగర్ నుంచి వచ్చే నీరు మూసీ నదిపై ఎలాంటి అటంకాలు లేకుండా ప్రవహించేలా చేశారు. వంతెన కింది నుంచి మూసీ నీరు ప్రవహిస్తుంది. సాగర్ కాల్వ నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలకు సాగునీరు అందిస్తుంది. ఇంజనీర్ల దూరదృష్టి, నైపుణ్యం, పట్టుదలకు ఈ కట్టడం సాక్ష్యంగా నిలిచింది.