
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
చిలుకూరు: అప్పుల బాధ తట్టుకోలేక మనస్తాపంకు గురైన రైతు గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదివారం చిలుకూరు మండలం జెర్రిపోతులగూడెం గ్రామంలో జరిగింది. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. జెర్రిపోతుగూడెం గ్రామానికి తానం రవీందర్‌రెడ్డి(42) గతంలో ఫైనాన్స్ నడిపించేవాడు. ఫైనాన్స్‌లో ఇబ్బందులు రావడంతో కొంతకాలంగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల గ్రామంలో రూ.60లక్షలతో కొత్త ఇల్లు నిర్మించాడు. మూడు నెలల క్రితం గృహ ప్రవేశం కూడా చేశాడు. ఇంటి నిర్మాణం కోసం తీసుకొచ్చిన అప్పులతో ఇబ్బందులు పడుతున్నాడు. అప్పు ఇచ్చిన కొంతమందికి సోమవారం తిరిగి చెల్లిస్తానని చెప్పినట్లుగా తెలిసింది. దీంతో వాళ్లకు డబ్బులు ఎలా ఇవ్వాలో తెలియక మనస్తాపానికి గురై ఆదివారం మధ్యాహ్నం ఇంటి వద్ద నుంచి గడ్డి మందు తీసుకొని పొలానికి వెళ్లాడు. అక్కడ గడ్డి మందు తాగి అపస్మారకస్థితిలో పడిపోయాడు. చుట్టుపక్కల రైతులు గమనించి రవీందర్‌రెడ్డి కుటుంబ సభ్యులకు సమచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.