
చెక్కుచెదరని కట్టడాలు
నిజాం కాలంలో, దశాబ్దాల క్రితం ఉమ్మడి జిల్లాలో నిర్మించిన పలు సాగునీటి ప్రాజెక్టులు, కాల్వలు, కట్టడాలు నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. సరైన సౌకర్యాలు లేని కాలంలో నిర్మితమైన ఈ కట్టడాలు ఆనాటి ఇంజనీర్ల మేధస్సుకు, ప్రతిభకు తార్కాణంగా నిలస్తున్నాయి. సోమవారం ఇంజనీర్స్ డే సందర్భంగా పురాతన కాలం నాటి కట్టడాలు, ప్రాజెక్టులపై ప్రత్యేక కథనం.
శతాబ్దాల చరిత్రకు సాక్ష్యం శాలిగౌరారం ప్రాజెక్టు
● ఉమ్మడి జిల్లాలో ఆనాటి
ఇంజనీర్ల ప్రతిభకు అద్దం
పడుతున్న నిర్మాణాలు
నేడు ఇంజనీర్స్ డే
శాలిగౌరారం: శాలిగౌరారం ప్రాజెక్టుకు శతాబ్దాల చరిత్ర ఉంది. 800 ఏళ్ల క్రితం కాకతీయ రాజులు శాలిగౌరారం మండలం వల్లాల గ్రామ శివారు నుంచి ఆకారం, శాలిగౌరారం, గురుజాల వరకు 12 కిలోమీటర్ల పొడవున ఉన్న ఏనెను ఆధారంగా చేసుకొని ఆకారం, శాలిగౌరారం చెరువులను నిర్మించారు. కానీ చెరువుల్లోకి నీరువచ్చేందుకు ఎలాంటి ఏర్పాటు చేయలేదు. నిజాం నవాబులు 1908లో శాలిగౌరారం చెరువును ప్రాజెక్టుగా తీర్చిదిద్దారు. ప్రాజెక్టులోకి నీరు వచ్చేందుకు వీలుగా రామన్నపేట మండలం పల్లివాడ వద్ద మూసీ నదికి అడ్డంగా ఆనకట్టతో పాటు హెడ్‌రెగ్యూలేటర్‌ను నిర్మించారు. ఈ హెడ్‌రెగ్యులేటర్ నుంచి శాలిగౌరారం ప్రాజెక్టు వరకు సుమారు 27 కిలోమీటర్ల మేర రాచకాల్వను తవ్వారు.
117 సంవత్సరాలైన చెక్కుచెదరని ప్రాజెక్టు, రాచకాల్వ..
117 సంవత్సరాల తర్వాత కూడా శాలిగౌరారం ప్రాజెక్టు, రాచకాల్వ చెక్కుచెదరలేదు. 1200 ఎకరాల విస్తీర్ణం, 21 అడుగుల నీటి సామర్ధ్యం ఉన్న శాలిగౌరారం ప్రాజెక్టు కట్ట పొడవు 3.5 కిలోమీటర్లు ఉంటుంది. ప్రాజెక్టుకు కుడి, ఎడమ తూములను నిర్మించి శాలిగౌరారం మండలంలోని తొమ్మిది గ్రామాల్లోని ఆరువేల ఎకరాలకు సాగునీరందేలా కాల్వలను తవ్వారు. రాచకాల్వలో నీటి ప్రవాహం ఎంత పెరిగినా కట్ట తెగకుండా 10 సర్‌ప్లస్ వియర్స్‌లను నిర్మించారు. అదేవిధంగా పల్లివాడ వద్ద హెడ్‌రెగ్యూలేటర్‌తో పాటు తుర్కపల్లి, అమ్మనబోలు వద్ద రెగ్యూలేటర్లను నిర్మించారు. ఆయా రెగ్యూలేటర్ల వద్ద షట్టర్ల నిర్మాణంతో పాటు ప్రవాహం పెరిగినప్పుడు నీటిని మూసీలోకి దారి మళ్లించేందుకు ఎస్కేప్ రెగ్యూలేటర్లను కూడా నిర్మించారు. రాచకాల్వకు ఒకవైపున మాత్రమే కట్ట ఉండటం విశేషం. ప్రాజెక్టు, రాచకాల్వపై ఉన్న రాతి కట్టడాలన్నీ డంగుసున్నంతో నిర్మించినవి కావడం గమనార్హం. శాలిగౌరారం ప్రాజెక్టుకు 40 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. రాచకాల్వకు అనుసంధానంగా శాలిగౌరారం ప్రాజెక్టుతో పాటు 24 చెరువులు, కుంటలు ఉన్నాయి.