
ఆధునిక దేవాలయం.. సాగర్
నాగార్జునసాగర్: ఆధునీక దేవాలయంగా పేరుగాంచిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు స్వదేశీ ఇంజనీర్ల పనితనానికి మచ్చుతునకగా నిలుస్తోంది. సాగర్ ప్రాజెక్టు పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించబడింది. 1955 డిసెంబర్ 10న ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయగా 12 సంవత్సరాలలో ఓ కొలిక్కి వచ్చింది. 45వేల మంది శ్రామికులు 24గంటలు పనిచేసి సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి ఎద్దుల బండ్లలో రాళ్లను తీసుకొచ్చి డ్యాం వద్దకు చేర్చేవారు. ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే రాతి నిర్మించిన కట్టడాలలో ఒకటి. 1967లో ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేశారు. అనంతరం 1974లో క్రస్ట్ గేట్ల నిర్మాణం పూర్తయ్యింది. ఆనాటి ఇంజనీర్లు ఎలాంటి లాభాపేక్ష లేకుండా దేశ అభివృద్ధి కోసం పనిచేసేవారని రిటైర్ ఇంజనీర్లు తెలిపారు. నేడు ఉన్నంత సాంకేతిక పరిజ్ఞానం, మిషనరీ ఆనాడు లేవు. కనీసం సమాచారాన్ని అందిపుచ్చుకోవడానికి కూడా నేడున్నన్ని సమాచార సాధనాలు లేవు. అయినా ఆనాటి ఇంజినీర్ల బలమైన కోరిక ప్రాజెక్టును సకాలంలో అంచనా వ్యయం కన్నా తక్కువ వ్యయంతో పూర్తిచేశారు. 590 అడుగుల ఎత్తులో ఈ ప్రాజెక్టుండగా.. 110 చదరపు మైళ్ల విస్తీర్ణంలో నీరు నిలబడి ఉంటుంది. ప్రాజెక్టు 408 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యం కల్గి ఉండేలా నిర్మించారు. కాలక్రమేణా పూడిక నిండటంతో ప్రస్తుతం 312 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. ప్రాజెక్టు నిర్మాణం అనంతరం పలుమార్లు అంచనాకు మించి వరదలు వచ్చినప్పటికీ సాగర్ ప్రాజెక్టు నిలబడింది. స్పిల్‌వే మీదుగా 2009లో 14లక్షల క్యూసెక్కులకు మించి నీటిని విడుదల చేశారు.

ఆధునిక దేవాలయం.. సాగర్