
ఇంజనీర్ల మేధోశక్తికి తార్కాణం ‘ఆసిఫ్‌నహర్’
రామన్నపేట/వలిగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టుల్లో ఆసిఫ్‌నహర్ కాలువ ప్రధానమైనది. ఈ కాలువ ద్వారా వలిగొండ, రామన్నపేట, నార్కట్‌పల్లి, కట్టంగూర్, నల్లగొండ మండలాలలోని 15,245 ఎకరాలకు సాగునీరు అందుతుంది. నిజాం రాజు ఆసిఫ్ అలీ 1903లో ఈ కాలువ తవ్వకాన్ని ప్రారంభించి 1906లో పూర్తిచేశాడు. నహర్ అనగా ఉర్దూలో కాలువ అని అర్ధం. ఈ కాల్వను ఆసిఫ్ అలీ కాలంలో నిర్మించడంతో ఆసిఫ్‌నహర్ అనే పేరు వచ్చింది. ఆసిఫ్‌నహర్ కాలువ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం నెమిలికాల్వ వద్ద ప్రారంభమవుతుంది. ఇక్కడ మూసీ నదిపై కత్వను ఏర్పాటుచేసి డిస్ట్రిబ్యూటరీని ఏర్పాటు చేశారు. ప్రారంభంలో కాలువ సామర్ద్యం 397క్యూసెక్కులు. కాలువ పొడవు 100కిలోమీటర్లు. ఇందులో సుమారు 13కి.మీ. కాలువ సహజ సిద్ధంగా ఉంది. కాలువ ద్వారా 21 పెద్ద చెరువులను, 32 చిన్న చెరువులను నింపడం జరుగుతుంది. కాలువ వెంట 135 తూములు, 15కత్వలు, 30వంతెనలు ఏర్పాటు చేశారు. నెమిలి కాల్వ కత్వ నుంచి నీళ్లు నేరుగా ఇంద్రపాలనగరం చెరువులోకి వస్తాయి. అక్కడి నుండి తూముల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తారు. పన్నెండు దశాబ్దాలు దాటినా ఆసిఫ్‌నహర్ కాలువ పటిష్టంగా ఉండడం ఆనాటి ఇంజనీర్ల పనితీరుకు అద్దం పడుతోంది. ఆనాటి ఇంజనీర్లు కత్వలతో పాటు రెగ్యులేటరీలు, వంతెనలు, చెరువులు, కాలువలు, తూముల నిర్మాణానికి పూర్తిగా రాతిని ఉపయోగించారు. తక్కువ ఖర్చు, తక్కువ శ్రమతో సహజ సిద్ధంగా కాలువలో నీరు పారేలా అప్పటి ఇంజనీర్లు డిజైన్ చేశారు. కాలువలో పూడికతీత, గుర్రపుడెక్క ఆకు తొలగింపు, గండ్లు పూడ్చివేత పనులు మినహా రెగ్యులరీలు, తూములకు వందేళ్ల కాలంలో చేసిన మరమ్మతులు చాలా తక్కువ.