
కింద వాగు.. పైన సాగర్ ఎడమ కాల్వ
హాలియా: నాటి ఇంజనీర్ల మదిలో పుట్టిన ఎన్నో అపురూపమైన కట్టడాలల్లో మచ్చుకకు కొన్ని మన కళ్ల ఎదుట సాక్షాత్కరిస్తున్నాయి. వాటిలో నాగార్జునసాగర్ నియోజకవర్గంలో అహల్య(హాలియా) వాగుపై నిర్మించిన ఆక్వెడక్ట్ నిర్మాణం ఒకటి. సాగర్ ఎడమ కాల్వ నిర్మాణ సమయంలో 1955–60 మధ్య కాలంలో హాలియా వాగుపై రాతితో ఈ ఆక్వెడక్ట్‌ను నిర్మించారు. ఆక్వెడక్ట్ అనేది కాల్వ నీటిని సహజ వాగులు, నదులు లేదా లోయల మీదుగా తీసుకెళ్లడానికి చేపట్టిన నిర్మాణం. హాలియా వాగుపై సుమారు 600 మీటర్ల పొడవు, 24 రాతి (కానాలు) పిల్లర్లతో పెద్ద బ్రిడ్జిని ఏర్పాటు చేసి దాని పైభాగంలో సాగర్ ఎడమ కాల్వ నీరు ప్రవహించేలా, కింది నుంచి హాలియా వాగు ప్రవహించేలా ఈ ఆక్వెడక్ట్‌ను నిర్మించారు. 24 పెద్ద రాతి గోడలను హాలియా వాగులో నిర్మించి దానిపై బ్రిడ్జి కట్టి ఆ పైభాగంలో సుమారు 25 ఫీట్ల ఎత్తులో కాల్వ ఉండేలా డిజైన్ చేశారు. యూ ఆకారంలో దీని నిర్మాణం చేపట్టి సాగర్ ఎడమ కాల్వ నీటి ప్రవహం వేగంగా వెళ్లేగా నాటి ఇంజనీర్లు రూపకల్పన చేశారు. కింది భాగంలో ఉన్న హాలియా వాగు ఎగువ నుంచి వచ్చే వరదతో వాగు ఉధృతంగా ప్రవహించే సమయంలో ఈ బ్రిడ్జి పర్యాటకులను ఆకట్టుకుంటుంది.

కింద వాగు.. పైన సాగర్ ఎడమ కాల్వ