
బాధితులకు సాయమందించండి – ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
ఆలేరు: భారీ వర్షానికి ఆలేరు పట్టణంలోని బైరవకుంట, ఏంకుంట, పర్రె కాల్వలు అలుగు పోయడంతో కొలనుపాక రోడ్డులో బ్రహ్మంగారి గుడి నుంచి పాత మున్సిపల్ కార్యాలయం, 11, 12 వార్డుల పరిధిలోని రంగనాయకుల వీధి, కుమ్మరివాడ తదితర ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. 30ఇళ్లు నీట మునిగాయి. ఆయా కుటుంబాలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. అత్యవసర మాన్‌సూన్ బృందంతో కలిసి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య బోట్‌లో ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. ఇళ్లలోకి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. వారం రోజులపాటు ముంపు బాధితులకు అవసరమైన సరుకులు, ఇతర సహాయం అందించాలని ఎమ్మెల్యే ఫోన్‌లో కలెక్టర్ హనుమంతరావును కోరారు. తనవంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే చెప్పారు. కొన్ని నాలాలు కబ్జాకు గురై ముంపు సమస్య ఏర్పడిందని, అధికారులతో చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.