
సిద్ధాంతానికి కట్టుబడిన నేత.. సురవరం
నల్లగొండ టౌన్: నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి చివరి వరకు కమ్యూనిస్టుగానే కొనసాగిన నేత సురవరం సుధాకర్‌రెడ్డి అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని జీఎల్ గార్డెన్స్‌లో సీపీఐ జాతీయ మాజీ కార్యదర్శి, నల్లగొండ మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కలిసి సురవరం సుధాకర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సురవరం సుధాకర్‌రెడ్డి నల్లగొండ ఎంపీగా పనిచేశారని, పార్లమెంట్‌లో కార్మికులు, రైతుల సమస్యలపై పోరాడారని గుర్తు చేశారు. ఆయన ఎంపీగా పనిచేసిన సమయంలో నల్లగొండలో ఎన్నో సమస్యల పరిష్కారానికి కృషి చేశారన్నారు. కమ్యూనిస్టులు లేవనెత్తే ప్రజా సమస్యలను పరిష్కరించేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని అన్నారు. కామ్రేడ్ అంటే వంద మందితో సమానమని.. ఒక్కడున్నా ఎర్రజెండాతో అన్యాయాన్ని ప్రశ్నిస్తాడని గుర్తుచేశారు. కమ్యూనిస్టులంటే తనకు గౌరవమని మంత్రి తెలిపారు. సుధాకర్‌రెడ్డి బతికున్నంత కాలం ప్రజల కోసం పనిచేసి, చనిపోయిన తర్వాత కూడా వైద్య విద్యార్థుల కోసం తన భౌతికకాయాన్ని ఇవ్వాలని కోరుకున్న గొప్ప నాయకుడని అన్నారు. సుధాకర్‌రెడ్డి విగ్రహాన్ని నల్లగొండలో ఏర్పాటు చేసేందుకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాతో పాటు దేశ ప్రజల హక్కుల సాధన, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం అనేక పోరాటాలు నిర్వహించిన ప్రజా ఉద్యమ నాయకుడు సురవరం అని కొనియాడారు. సుధాకర్‌రెడ్డి విద్యార్థి దశనుంచే కమ్యూనిస్టు భావాలకు ఆకర్షితుడై వివిధ హోదాల్లో పనిచేసి జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగారన్నారు. జిల్లా నుంచి రెండుసార్లు ఎంపీగా పనిచేశారని గుర్తుచేశారు. తామిద్దరం వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేసినా వ్యక్తిగత విమర్శలు చేసుకోలేదన్నారు. ఫ్లోరైడ్ ప్రాంతానికి తాగు, సాగునీరు సాధించేందుకు కమ్యూనిస్టులు చేసిన పోరాటానికి తాను సంఘీభావం తెలిపానని చెప్పారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి కోసం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. ప్రజా జీవితంలో ఎన్నో ఉద్యమాలకు నేతృత్వం వహించి చారిత్రక ఉద్యమ విజయాలను చవిచూసిన వ్యక్తి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. కమ్యూనిస్టులు మృతిచెందినా ప్రజల మధ్యలో జీవిస్తారని అదే కోవలోకి సురవరం వస్తారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, నాయకులు పల్లా నర్సింహారెడ్డి, లొడంగి శ్రవణ్‌కుమార్, పల్లా దేవేందర్‌రెడ్డి, మల్లేపల్లి ఆదిరెడ్డి, ఉజ్జిని రత్నాకర్‌రావు, కలకొండ కాంతయ్య, శ్రీనివాస్, పల్లె నర్సింహ, బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, గుమ్మల మోహన్‌రెడ్డి, తుమ్మల వీరారెడ్డి, ఉజ్జిని యాదగిరిరావు, హాశం, పబ్బు వీరస్వామి, రామచంద్రం, వెంకటేశ్వర్లు, నర్సింహ, బుచ్చిరెడ్డి పాల్గొన్నారు.
ఫ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
ఫ నల్లగొండలో సురవరం సుధాకర్‌రెడ్డి సంస్మరణ సభ