
తాళం వేసిన ఇంట్లో చోరీ
ఫ చెవిదిద్దులు, రూ.20వేల నగదు, 15 చీరల అపహరణ
కోదాడరూరల్: తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన కోదాడ పట్టణ పరిధిలోని భవానీనగర్‌లో బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భవానీనగర్‌లో నివాసముండే వేనేపల్లి నాగేశ్వరరావు దంపతులిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు. వారిద్దరు నడిగూడెంలో ఉంటూ వారంలో రెండు రోజులు కోదాడకు వచ్చి వెళ్తుంటారు. బుధవారం నాగేశ్వరరావు ఇంటికి పనిమనిషి వచ్చి చూడగా తాళం పగులగొట్టి ఉండటం గమనించింది. వెంటనే నాగేశ్వరరావుకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి చూడగా.. బీరువాలోని రెండు జతల చెవిదిద్దులు, కిడ్డీ బ్యాంకులో పిల్లలు దాచుకున్న రూ.20వేల నగదు, 15 చీరలు చోరీకి గురైనట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కోదాడ పట్టణ పోలీసులు తెలిపారు.
ఇంజన్‌లో మంటలు చెలరేగి ఆటో దగ్ధం
చౌటుప్పల్ రూరల్: ఇంజన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి ఆటో దగ్ధమైంది. ఈ ఘటన విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలం బొర్రోళ్లగూడెం గ్రామ స్టేజీ వద్ద బుధవారం మధ్యాహ్నం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా అంబర్‌పేట్ నుంచి ఏపీలోని విజయవాడకు పేపర్ లోడ్‌తో ఆటో వెళ్తుండగా.. మార్గమధ్యలో చౌటుప్పల్ మండలం బొర్రోళ్లగూడెం గ్రామ స్టేజీ వద్దకు రాగానే ఇంజన్ నుంచి పొగలు వచ్చాయి. డ్రైవర్ గమనించి విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన ఆటో ఆపుతుండగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ పక్కన ఉన్న డోరు తెరుచుకోకపోవడంతో ఎడమ వైపు డోరు నుంచి డ్రైవర్ జడ నాగరాజు ఆటోలో నుంచి కిందకు దూకాడు. ఆటోలో పేపర్ లోడ్ ఉండడంతో చూస్తుండగానే ఆటో పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని చౌటుప్పల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మన్మథకుమార్ తెలిపారు.