
కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది
సూర్యాపేటటౌన్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ–ఫార్ములా కాదు.. యూరియా ఫార్ములా ఏందో చెప్పాలన్నారు. హైకోర్టు ఆర్డర్‌తో గ్రూప్–1 ఫార్ములా తేలిపోయిందన్నారు. రెండేళ్లుగా ఇచ్చిన హామీలు పక్కన పెట్టి రకరకాల సమస్యలు సృష్టిస్తున్నారని.. కరెంట్, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రతీది అబద్ధం అని తేలిపోయిందని పేర్కొన్నారు. గ్రూప్–1 విషయంలో కాంగ్రెస్ పార్టీ డ్రామాలు బయటపడడంతో.. ఈ ఫార్ములాపై కేసు అంటూ సీఎం రేవంత్‌రెడ్డి నాటకాలు ఆడుతున్నారన్నారు. అసలు కేసులు పెట్టాల్సి వస్తే ఈ రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ పాలకులను వంద సార్లు జైలులో పెట్టొచ్చన్నారు. రాష్ట్రంలో రైతులు, మహిళలు ఎట్లా శాపనార్థాలు పెడుతున్నారో.. యువత ఎంత కోపంగా ఉన్నారో చూస్తున్నామన్నారు. హాస్టళ్లలో విషాహారం తిని చనిపోయిన విద్యార్థుల ఆత్మలు ఘోషిస్తున్నాయన్నారు. ఏ ప్రభుత్వమైనా ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలని హితవు పలికారు. కేసీఆర్‌ను తిట్టడం, కేసులు పెడతామనే చిల్లర మాటలను సీఎం రేవంత్‌రెడ్డి బంద్ చేయాలన్నారు. రైతులు ఒక పక్క యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారని, వాళ్ల దృష్టిలో రేవంత్‌రెడ్డి ఎప్పటికీ ద్రోహిగానే మిగిలిపోతాడని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ.. కేసును సీబీఐకి అప్పగించడంతోనే ప్రధాని నరేంద్ర మోదీతో రేవంత్‌రెడ్డి బంధం బహిరంగమైందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలను ఏమార్చడం ఎవరికీ సాధ్యం కాదని అన్నారు.
ఫ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి