
చేనేత కార్మికుడి ఆత్మహత్య
సంస్థాన్ నారాయణపురం: ఇంటి కొనుగోలు కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం కానరాక మనస్థాపంతో ఓ చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామానికి చెందిన పానగంటి క్రాంతి(28) చేనేత కార్మికుడుగా పనిచేస్తున్నాడు. మూడు సంవత్సరాల క్రితం గ్రామంలో ఇల్లు కొనుగోలు చేశాడు. ఆ తర్వాత తాను, వివాహం చేసుకున్నాడు. రెండు సంవత్సరాల నుంచి చేనేత పనులు అంతంతమాత్రంగానే ఉండడంతో కుటుంబ పోషణకు కూడా అప్పులు చేసినట్లు గ్రామస్తులు చెప్పారు. మొత్తంగా క్రాంతికి ప్రస్తుతం సుమారు రూ.15లక్షల అప్పులు ఉన్నట్లు తెలిసింది. చేనేత మీద వచ్చే సంపాదన కుంటుంబ పోషణకు సరిపోవడం లేదు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతుండటం, అప్పులు ఎలా తీర్చలో తెలియక మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం గ్యాస్ సిలిండర్ తీసుకుని వస్తానని గ్రామం నుంచి సంస్థాన్ నారాయణపురం వెళ్లాడు. అక్కడ గడ్డి నివారణ మందు కొనుగోలు చేసి, అక్కడే తాగి ఇంటికి వచ్చాడు. ఇంటి వద్ద వాంతి చేసుకొవాడానికి ప్రయత్నం చేశాడు. కుంటుంబ సభ్యులు గమనించి అతడిని చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుప్రతికి తరలించారు. అక్కడ నుంచి నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం హైదారాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ జగన్ తెలిపారు.