
సాయుధ పోరాటం ద్వారానే స్వేచ్ఛ
భువనగిరిటౌన్ : ఆనాడు తెలంగాణ రైతాంగం చేసిన సాయుధ పోరాటం ద్వారానే ఈ ప్రాంత ప్రజలకు స్వేచ్ఛ లభించిందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. మంగళవారం భువనగిరి పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎండీ జహంగీర్ అధ్యక్షతన నిర్వహించిన ప్రజా సదస్సులో రాఘవులు పాల్గొని మాట్లాడారు. ఆనాడు భూస్వాముల దౌర్జన్యాలు శృతిమించడంతో తెలంగాణ సాయుధ పోరాటం ఆవిర్భవించిందన్నారు. తెలంగాణ ప్రాంతం అభివృద్ధి వెనుక 4000 మంది సాయుధ పోరాట అమరవీరుల త్యాగాలు ఉన్నాయన్నారు. నాడు నిజాం సర్కారు ప్రజలపై బలవంతంగా ఉర్దూ భాషను రుద్దినట్లే.. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలపై బలవంతంగా హిందీ భాషను రుద్దడానికి ప్రయత్నిస్తోందన్నారు. అప్పట్లో నిజాం అవలంబించిన ఫాసిస్టు విధానాలనే నేడు ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ అవలంబిస్తున్నాయన్నారు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలు రైతాంగ సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తూ హిందూ, ముస్లిం వివాదంగా మార్చడానికి ప్రయత్నం చేస్తుందన్నారు. తెలంగాణ పోరాటాలపై తప్పుడు వక్రీకరణలు చేస్తే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు తెలంగాణ విముక్తి పోరాటంలో ఏం హక్కు ఉందని ప్రశ్నించారు. చదువు లేని ఆడవారికి ఓటు హక్కు వద్దన్న వ్యక్తులు.. నేడు దేశాన్ని పాలిస్తూ ఓటరు జాబితాలను తారుమారు చేస్తున్నారని విమర్శించారు. ఓటరు జాబితాలో మైనార్టీలు, ఆడవారితో పాటు తమకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారి పేర్లు తీసేస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో డబ్బు, కులం, మతం పేరిట గెలవాలని చూస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తోందన్నారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఆడవారు ఇంటికి సేవలు అధికంగా చేయాలని అనడం ఆయనలోని ఫాసిస్టు విధానాలకు తార్కాణమన్నారు. అనంతరం సీపీఎం నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ.. పోరాట వీరురాలు చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని ఈ నెల 10 నుంచి 17వ తేదీ వరకు తెలంగాణ రైతాంగ సాయుధ విప్లవ పోరాటాల వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో సుమారు 30 తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కేంద్రాలు ఉన్నాయని, వాటిల్లో సభలు, సమావేశాలు నిర్వహించాలన్నారు. కళాకారులు పోరాట చరిత్రను కళారూపాల ద్వారా ప్రజలకు అర్థమయ్యేటట్లు చేయాలన్నారు. ప్రజానాట్యమండలి కళాకారులు పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. ఈ సదస్సులో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, జి. శ్రీనివాస్‌చారి, నాయకులు గూడూరు అంజిరెడ్డి, మాయ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
సదస్సులో మాట్లాడుతున్న బీవీ రాఘవులు
బీఆర్‌ఎస్ పార్టీది
అవ కాశవాద రాజకీయం
సాక్షి యాదాద్రి : కీలకమైన ఉప రాష్ట్రపతి ఎన్నిక సమయంలో బీఆర్‌ఎస్ పార్టీ అవకాశవాదంగా వ్యవహరించిందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. మంగళవారం భువనగి జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సామాజిక న్యాయాన్ని రక్షించేందుకు, రాజ్యాంగంలోని మౌలిక విలువలను కాపాడేందుకు ప్రతిపక్షాలు జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి మద్దతుగా నిలిచాయన్నారు. ఎన్నికకు దూరంగా ఉండి బీఆర్‌ఎస్ పార్టీ పరోక్షంగా బీజేపీకి మద్దతు ఇచ్చిందని విమర్శించారు. రాష్ట్రాలకు అమ్మకం పన్ను అనేది ముఖ్యమైన ఆదాయమని, జీఎస్టీ వచ్చిన తర్వాత కేంద్రం.. రాష్ట్రాలకు రావాల్సిన ఆదాయానికి గండి కొట్టిందన్నారు. దేశంలో రెండు విధానాల జీఎస్టీ అమలు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టపరిహారం కేంద్రం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే ప్రభుత్వాలకు ఆర్థిక వనరులు చాలా కష్టంగా ఉన్నాయన్నారు. తెలంగాణకు రూ.9వేల కోట్ల నష్టం వాటిల్లుతోందని ఆర్థిక శాఖ కమిషన్ వెల్లండించిన విషయాన్ని రాఘవులు గుర్తుచేశారు. నీటి వాడకం ఎక్కువ ఉండే పంటలను తగ్గించేందుకు యూరియాను కంట్రోల్ చేసి రైతుల బలవంతం గా పంటల మార్పిడి విధానం తేవాలని చూస్తుందని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు.
వాస్తవాలు వక్రీకరిస్తే
తిరుగుబాటు తప్పదు
సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు