
ఉత్తరప్రదేశ్ ప్రజాప్రతినిధుల పర్యటన
రామన్నపేట, చౌటుప్పల్ రూరల్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు మంగళవారం రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామాన్ని, చౌటుప్పల్ మండలంలోని దేవలమ్మ నాగారం గ్రామాన్ని సందర్శించారు. ఆ రాష్ట్ర డీపీఆర్‌ఓ బులానంద్ సహాన్, డీపీఓ నవీన్‌మిత్ర సారథ్యంలో 30మంది ప్రజాప్రతినిధులు వెల్లంకి గ్రామ అభివృద్ధి పనులు, పారిశుద్ధ్యం నిర్వహణ, మౌలిక వసతుల కల్పన, పంచాయతీ కార్యాలయం నిర్వహణను పరిశీలించారు. రైతువేదికలో గ్రామస్తులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. గ్రామంలో ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, ప్రభుత్వం రైతులకు అందిస్తున్న ప్రోత్సాహకాలపై ఆరా తీశారు. అనంతరం ఆచార్య కూరెళ్ల గ్రంథాలయాన్ని సందర్శించారు. వారి వెంట అడిషనల్ డీఆర్‌డీఓ సురేష్, డీఎల్‌పీఓ ప్రతాప్‌నాయక్, ఎంపీడీఓ రాములు, ఎంపీఓ రవూఫ్‌అలీ, ఏఈలు గాలయ్య, ఆశిష్‌రాఘవ, ఏపీఓ వెంకన్న, టీఏ సుచరిత, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.
దేవలమ్మ నాగారం గ్రామం సందర్శన..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆయా జిల్లాల నుంచి ఒక్కొక్కరి చొప్పున 30 మంది సర్పంచులు తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్‌లో ట్రైనింగ్ తీసుకోవడానికి హైదరాబాద్‌కు వచ్చారు. 2024లో హెల్త్ పంచాయతీ విభాగంలో చౌటుప్పల్ మండలంలోని దేవలమ్మ నాగారం జాతీయ స్థాయిలో నామినేట్ అయిన నేపథ్యంలో హెల్త్ పంచాయతీ విభాగంలో తీసుకుంటున్న చర్యలను అధ్యయనం చేయడానికి వారు ఈ గ్రామాన్ని సందర్శించారు. ఇక్కడ అమలుచేస్తున్న పథకాలను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట యూపీ రాష్ట్రానికి చెందిన జిల్లా పంచాయతీ అధికారి శ్రీవాత్సవ్, ట్రైనింగ్ కన్సల్టెంట్ అశ్విన్‌కుమార్, ట్రైనింగ్ కో ఆర్డినేటర్ అనిల్‌కుమార్, అడిషనల్ డీఆర్‌డీఓ సురేష్, ఎంపీడీఓ సందీప్‌కుమార్, డీఎల్‌పీఓ ప్రతాప్‌నాయక్, ఎంపీఓ అంజిరెడ్డి, పీఆర్ ఏఈ నితీష్, వైద్యాధికారి డాక్టర్ శివ తదితరులు పాల్గొన్నారు.

ఉత్తరప్రదేశ్ ప్రజాప్రతినిధుల పర్యటన