
15న ఎంజీయూ స్నాతకోత్సవం
నల్లగొండ టూటౌన్: నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ నాల్గో స్నాతకోత్సవాన్ని ఈ నెల 15న నిర్వహించనున్నట్లు వైస్ ఛాన్స్‌లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ తెలిపారు. యూనివర్సిటీలోని తన ఛాంబర్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్‌మూర్తి ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నట్లు తెలిపారు. వారి చేతుల మీదుగా 22 మంది పీహెచ్‌డీ పరిశోధకులకు, 57 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందజేస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా ఎంజీయూ పరిధిలోని కళాశాలల్లో 2022–23, 2023–24 విద్యా సంవత్సరంలో డిగ్రీ పూర్తి చేసిన 16,210 మందికి, పీజీ పూర్తిచేసిన 3,200 మందికి, బీఈడీ పూర్తి చేసిన 7,800 మందికి పట్టాలు అందించనున్నట్లు తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా లా కాలేజీ, ఫార్మసీ కాలేజీ ఏర్పాటుకు అనుమతి లభించిందని, రానున్న రోజుల్లో మరో మూడు కొత్త కోర్సులు వస్తాయని స్పష్టం చేశారు. 2007లో 500 మందితో ప్రారంభమైన ఎంజీయూలో ప్రస్తుతం 2500 మంది విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. మొత్తం 18 డిపార్ట్‌మెంట్లు ఉండగా వాటిలో 12 కోర్సుల్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ఉన్నట్లు తెలిపారు. యూనివర్సిటీకి మొత్తం 70 పోస్టులు మంజూరు కాగా.. 35 మందిని తీసుకున్నారని, మిగతా పోస్టుల్లో 46 మందిని కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించారని తెలిపారు. రూ.60 కోట్లతో వసతి గృహాలు, రూ.12 కోట్లతో అడ్మినిస్ట్రేషన్ భవన్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. అకడమిక్ సంస్కరణల్లో భాగంగా 75 శాతం హాజరు తప్పనిసరి చేశామని, విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపు కోసం వివిధ సంస్థలతో ఒప్పందం చేసుకున్నట్లు వివరించారు. ప్రస్తుతం ఎంజీయూకి న్యాక్ బీ ప్లస్ ర్యాంకు ఉందని, 2028 నాటికి న్యాక్ ఏ ప్లస్ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఎంజీయూ సీఓఈ జి. ఉపేందర్‌రెడ్డి, లక్ష్మీ ప్రభ, సంధ్యారాణి, ప్రవళిక పాల్గొన్నారు.
ముఖ్యఅతిథులుగా హాజరుకానున్న గవర్నర్, ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్
57 మందికి గోల్డ్ మెడల్స్, 22
మందికి పీహెచ్‌డీ పట్టాలు ప్రదానం చేయనున్నట్లు వెల్లడించిన వీసీ