
మెట్ట వరి సాగుతో బహుళ ప్రయోజనాలు
త్రిపురారం: మెట్ట వరి సాగుతో రైతులకు బహుళ ప్రయోజనాలు చేకూరుతాయని భారతీయ వరి పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త పద్మావతి అన్నారు. మంగళవారం త్రిపురారం మండలంలోని కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే), భారతీయ వరి పరిశోధనా స్థానం, రాజేంద్రనగర్ సంయుక్త ఆధ్వర్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక సౌజన్యంతో నల్లగొండ జిల్లాలోని రైతులకు వరి సాగులో యాజమాన్య పద్ధతులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త పద్మావతి వరిలో మొగి పురుగు నిర్మూలన, సమగ్ర యాజమాన్యం, మొగి పురుగు గుర్తించే పద్ధతులతో పాటు లింగాకర్షక బుట్టలు వరి పొలంలో ఉపయోగించే విధానం, వాటి ప్రయోజనాలను తెలియజేశారు. మొట్ట వరి సాగులో కలుపు యాజమాన్యం అత్యంత కీలకమని ఆమె రైతులకు సూచించారు. రైతులకు లింగాకర్షక బుట్టలు పంపిణీ చేశారు. అనంతరం నీలాయిగూడెం గ్రామంలో రైతు కంచి సోమయ్య సాగు చేసిన మెట్ట వరి పొలాన్ని రైతులతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ చంద్రశేఖర్, యంగ్ ప్రొఫెషనల్స్ సుష్మ, అజయ్, సాయికుమార్, శ్రీకాంత్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
భారతీయ వరి పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త పద్మావతి