
రోడ్లు, వంతెనల సమస్య తీర్చండి
సాక్షి,యాదాద్రి : నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న రోడ్లు, బ్రిడ్జిల సమస్యను పరిష్కరించాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి కోరారు. సోమవారం హైదరాబాద్‌లో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. మూసీ నదిపై బొల్లెపల్లి– సంగెం బ్రిడ్జి నిర్మాణానికి టెండర్ పిలిచి పనులు త్వరితగతిన ప్రారంబించాలని కోరారు. జూలూరు – రుద్రవెల్లి హైలెవల్ బ్రిడ్జి పనులు 12 ఏళ్లుగా ముందుకు సాగడం లేదన్నారు. బ్రిడ్జి పనులను కాంట్రాక్టర్ పూర్తి చేయకుండా మధ్యలోనే వదిలేశారని పేర్కొన్నారు. పాత కాంట్రాక్ట్ టెండర్ రద్దు చేసి హెచ్‌ఎండీఏ నిధులు కేటాయించి పనులు పూర్తి చేయించాలని కోరారు. భువనగిరి – చిట్యాల రోడ్డు విస్తరణకు నిధులు ఇవ్వాలన్నారు. ప్రస్తుతం ఈ రహదారి నాగిరెడ్డిపల్లి వరకు నేషనల్ హైవే 161 ఏఏలో ఉందని, ఆర్‌అండ్‌బీకి బదిలీ చేయాలని విన్నవించారు. హ్యామ్ పథకంలో నాలుగు లేన్లుగా విస్తరించి పనులు వేగవంతం చేయాలన్నారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఫ మంత్రి కోమటిరెడ్డికి ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి వినతి