
బుద్ధవనాన్ని సందర్శించిన ఢిల్లీ బృందం
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కల్చరల్ డైరెక్టర్ రేగుళ్ల మల్లికార్జునరావు ఆధ్వర్యంలో ఢిల్లీకి చెందిన ఇండియన్ ట్రస్ట్ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ హెరిటేజ్ సంస్థకు చెందిన బృందం సందర్శించారు. ఈ సందర్భంగా బుద్ధవనంలోని బుద్ధ చరితం, జాతక వనం, ధ్యాన వనం, స్థూప వనాలను సందర్శించి మహాస్థూపంలోని అంతర్భాగంలో ఉన్న ధ్యాన మందిరాన్ని వీక్షించారు. వీరికి బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, ఎస్టేట్ మేనేజర్ రవిచంద్రులు బుద్ధవనం వివరాలను వివరించారు. అనంతరం పంచశీల కండువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కల్చరల్ డైరెక్టర్ రేగుల మల్లికార్జునరావు మాట్లాడుతూ.. గ్రామీణ వారసత్వం, అభివృద్ధి కోసం భారతీయ ట్రస్ట్ సంస్థ నాగార్జునసాగర్‌లో బుద్ధిజం అకాడమీ స్థాపించడానికి విజయపురి సౌత్‌లోని అవసరమైన స్థల పరిశీలన చేశామని అన్నారు. ఈ సంస్థ గ్రామీణ సంప్రదాయాలు, సంస్కృతులను పరిరక్షిస్తుందని పేర్కొన్నారు. స్థానిక యువతకు కావాల్సిన నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో కూడా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. స్థల పరిశీలన చేసిన వారిలో ఇండియన్ ట్రస్ట్ ఫర్ రూరల్ హెరిటేజ్ అండ్ డెవలప్‌మెంట్ సంస్థ వైస్ చైర్మన్ ఏజీకే మీనన్‌తో పాటు బృందం సభ్యురాలు ప్రీతి, పల్నాడు జిల్లా పర్యాటక శాఖ అధికారి నాయుడమ్మ తదితరులు పాల్గొన్నారు.