
యాదగిరిగుట్ట క్షేత్రంలో నిత్య కల్యాణం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం స్వామివారి నిత్య కల్యాణాన్ని అర్చకులు ఘనంగా జరిపించారు. ఉదయాన్నే ఆలయాన్ని తీసిన అర్చకులు సుప్రఽభాతం, ఆరాధన నిర్వహించారు. అనంతరం నిజాభిషేకం, అర్చన చేపట్టారు. ప్రథమ ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమాన్ని జరిపించి, అనంతరం గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలు చేశారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చనమూర్తులకు అష్టోత్తర పూజలు చేపట్టారు. సంపూర్ణ చంద్ర గ్రహణం నేపథ్యంలో ఆలయాన్ని ఆదివారం మధ్యాహ్నం 12.05గంటలకు మూసివేశారు.
మాంట్రియల్ నగరంలో..
తెలంగాణ కెనడా అసోసియేషన్(టీసీఏ) ఆధ్వర్యంలో కెనడాలోని మాంట్రియల్ నగరంలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాన్ని ఆలయ విశ్రాంత ప్రధాన అర్చకులు నల్లంధీఘల్ లక్ష్మీనరసింహాచార్యులు, ఆలయ అధికారి గజివెల్లి రఘు, టీసీఏ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మన్నెం ఆధ్వర్యంలో శనివారం రాత్రి వైభవంగా నిర్వహించారు. మాంట్రియల్ నగరంలోని ఓ హాల్‌లో స్వామి, అమ్మవార్లను అలంకరించి పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా కల్యాణం జరిపించారు. ఈ వేడుకలో తెలంగాణ కెనడా అసోసియేషన్ సభ్యులు, కెనడాలోని వివిధ నగరాల భక్తులు పాల్గొన్నారు.

యాదగిరిగుట్ట క్షేత్రంలో నిత్య కల్యాణం