
యువకుడిపై హత్యాయత్నం
చివ్వెంల(సూర్యాపేట): చివ్వెంల మండలం దురాజ్‌పల్లి గ్రామంలో యువకుడిపై హత్యాయత్నం జరిగిన ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ జి. రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. దురాజ్‌పల్లి గ్రామానికి మాజీ కౌన్సిలర్, బీఆర్‌ఎస్ నాయకుడు షేక్ బాషా తనపై బాటిల్‌తో దాడి చేసి, హత్య చేసేందుకు ప్రయత్నించాడని అదే గ్రామానికి చెందిన షేక్ మునీర్ చివ్వెంల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు బాషాపై కేసు నమోదు చేసి ఆదివారం ఉదయం అతడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ నాయకులు, గ్రామస్తులు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని బాషాను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆందోళన చేపట్టారు. దీంతో చివ్వెంల సీఐ పెన్‌పహాడ్, సూర్యాపేట రూరల్ ఎస్‌ఐలను పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. అనంతరం ఘటనా స్థలానికి వెళ్లి సీసీ కెమెరాలను పరిశీలించగా.. బాధితుడి వెంట బాషా వచ్చినట్లు గుర్తించి అతడిపై హత్యయత్నం కేసు నమోదు చేశారు. మూడు గంటల పాటు పోలీస్ స్టేషన్‌లో కూర్చోబెట్టారు. అనంతరం తదుపరి విచారణకు సహకరించాలని తెలుపుతూ బాషాను ఇంటికి పంపించారు. ఈ కేసులో ఇంకా కొన్ని సీసీ కెమెరాలు పరిశీలించాలని, పూర్తి విచారణ జరిపి వివరాలు వెల్లడిస్తామని సీఐ పేర్కొన్నారు.
● బాధితుడి ఫిర్యాదు మేరకు
మాజీ కౌన్సిలర్‌పై కేసు నమోదు
● పోలీస్ స్టేషన్ ఎదుట గ్రామస్తులు,
బీఆర్‌ఎస్ నాయకుల ఆందోళన

యువకుడిపై హత్యాయత్నం