
పోలీసులతో వాగ్వాదం
మోత్కూరు: మోత్కూరు రైతు సేవా సహకార సంఘంలో యూరియా పంపిణీలో గందరగోళం చోటు చేసుకుంటుంది. శుక్రవారం ఉదయం యూరియా లోడ్ రావడంతో పెద్ద సంఖ్యలో రైతులు సహకార సంఘం వద్దకు చేరుకున్నారు. సీరియల్ లేకుండా యూరియా పంపిణీ చేస్తున్నారని రైతులు ఆరోపించడంతో పోలీసులు టోకెన్‌ల ప్రకారం పంపిణీ చేశారు. 163 మంది రైతులకు ఒక్కొక్కరికి 2 బస్తాల చొప్పున 326 బస్తాల యూరియా పంపిణీ చేశారు. ఇంకా 118 బస్తాల యూరియా మిగలగా టోకెన్లు లేని రైతులకు ఇచ్చారని పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా బస్తాలతో వెళ్తున్న ట్రాక్టర్‌ను అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, రైతులకు వాగ్వాదం చోటు చేసుకుంది. ఐదారు రోజుల క్రితమే టోకెన్లు పొందిన తమకు యూరియా ఇవ్వకుండా వెనుక వచ్చిన రైతులకు ఇచ్చారంటూ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. సింగిల్‌విండో సిబ్బందిని సీఐ మందలించి అందుబాటులో ఉన్న ఆరు బస్తాల యూరియాను మహిళా రైతులకు ఇప్పించి మిగిలిన రైతులకు సర్దిచెప్పారు. కాగా ఆధార్, పాస్‌బుక్, జిరాక్స్‌లు తీసుకున్న రైతులకు మాత్రమే యూరియా బస్తాలు పంపిణీ చేశామని సింగిల్‌విండో చైర్మన్ పేలపూడి వెంకటేశ్వర్లు తెలిపారు.