
నిమజ్జనానికి వెళ్లి కాల్వలో గల్లంతు
భద్రతా ఏర్పాట్లు కరువు
వేములపల్లి : వేములపల్లి మండల కేంద్రంలోని సాగర్ ఎడమ కాల్వలో వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి వెళ్లిన తండ్రి, కుమారుడు గల్లంతయ్యారు. మాడ్గులపల్లి మండలం ఆగామోత్కూర్ గ్రామానికి చెందిన తండ్రి, కుమారులు పున్నా సాంబయ్య(46), పున్నా శివమణి(20) తమ గ్రామంలోని వినాయకుడిని తమ కాలనీవాసులతో కలిసి వేములపల్లి మండల కేంద్రం సమీపంలో ఎడమకాల్వలో నిమజ్జనం చేయడానికి వచ్చారు. నిమజ్జనం అనంతరం తండ్రి, కుమారుడు తమపై ఉన్న రంగులను శుభ్రం చేసుకోవడానికి కాల్వలో దిగిన సమయంలో ప్రమాదవశాత్తు తండ్రి సాంబయ్య జారిపడ్డాడు. తండ్రిని కాపాడుదామని కుమారుడు ప్యాంటును అందించి కాపాడే సమయంలో కాల్వ లోకి జారిపోయాడు. కాల్వలో బ్రిడ్జి వద్ద నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో వారు గల్లంతయ్యారు. సాంబయ్య బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
కొనసాగుతున్న గాలింపు
పున్నా సాంబయ్య, పున్నా శివమణి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, సబ్ కలెక్టర్ నారాయణ్‌అమిత్, డీఎస్పీ రాజశేఖర్‌రాజు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గాలించేందుకు సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే వెంట సీఐ పీఎన్‌డీ ప్రసాద్, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ హేమలత ఉన్నారు.
అనాథగా మిగిలిన కుమార్తె..
ప్రమాదానికి గురైన సాంబయ్యకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. భార్య చనిపోయింది. సాంబయ్య వంట మాస్టర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కుమారుడు శివమణి ఐటీఐ చదువుతుండగా, కుమార్తె తుంగపాడు గ్రామంలోని గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. తండ్రి, అన్న కాల్వలో గల్లంతు కావడంతో బాలిక అనాథగా మిగిలింది.
నిమజ్జన ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నామమాత్రంగా కొంతమందిని మాత్రమే సిబ్బందిని నియమించారని తెలిపారు. గజ ఈతగాళ్లు లేకపోవడం వల్లే వారిని కాపాడలేకపోయినట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు.
ఫ తండ్రి, కుమారుడి ఆచూకీ కోసం కొనసాగుతున్న గాలింపు
ఫ ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, సబ్ కలెక్టర్ నారాయణ్‌అమిత్

నిమజ్జనానికి వెళ్లి కాల్వలో గల్లంతు

నిమజ్జనానికి వెళ్లి కాల్వలో గల్లంతు