
అంతర పంటలతో అధిక ఆదాయం
గుర్రంపోడు : పండ్ల తోటలు సాగు చేసే రైతులు మొక్కలు నాటిన తర్వాత కాపు వచ్చే 4–5 సంవత్సరాల వరకు అంతర పంటలుగా స్వల్పకాలిక పంటలైన మునగ, చిక్కుడు జాతి పంటలు, వేరుశనగ, పెసర, మినుము, కూరగాయలు, పుచ్చ సాగు చేసుకుని ఆదాయం పొందే వీలుంది. అంతర పంటల సాగుపై మండల వ్యవసాయాధికారి మాధవరెడ్డి సూచనలు ఆయన మాటల్లోనే..
అంతర పంటలతో లాభాలు
A పండ్లతోటలు ఎక్కువ దూరంలో నాటడం వల్ల ఎక్కువ నీటి తడులు ఇవ్వడంతో భూమిలో కలుపు పెరిగే అవకాశం ఉంది. ఈ కలుపును అంతర పంటలు నివారిస్తాయి.
A సహజ వనరులైన భూమి, నీరు, సూర్యరశ్మి సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు.
A వివిధ రకాల అంతరపంటల సాగువల్ల నేలలో వివిధ లోతుల్లో గల తేమ పోషక పదార్థాలు క్రమబద్ధంగా ఉపయోగపడటమేకాకుండా నేల లోపలి వరకు గుల్లబారి తర్వాత పంటలు బాగా పెరగటానికి దోహదపడుతుంది.
A ప్రధాన పంటలతోపాటు అంతరపంటలు ఒకే సమయంలో పండించడం వల్ల రైతులకు రాబడులు స్థిరంగా ఉంటాయి.
A అంతరపంటలుగా అపరాల పంటలు సాగుచేసుకుంటే భూసారం అభివృద్ధి చెందుతుంది.
వేసుకోదగిన అంతర పంటలు
మామిడి : నేల లోతు, ఎంపిక చేసుకునే రకాన్ని బట్టి మామిడి మొక్కలను 7–10 మీటర్ల దూరంలో నాటుతారు. కాబట్టి మొక్కల మధ్య ఖాళీ స్థలం ఎక్కువగా ఉంటుంది.
A లేత తోటల్లో సూర్యరశ్మి, గాలి ప్రసారం బాగా ఉంటుంది. ఇందులో అంతర పంటలుగా కూరగాయలు, తక్కువ ఎత్తు పెరిగే పైర్లు బొప్పాయి, మునగ లాంటి మొక్కలు వేసుకోవచ్చు. పెద్దతోటల్లో నీడలో పెరిగే అల్లం, పసుపు పైర్లు వేసుకోవచ్చు. దీర్ఘకాలంలో ఆదాయానిచ్చే ఎర్రచందనం, శ్రీగంధం కూడా సాగు చేసుకోవచ్చు.
బత్తాయి, నిమ్మ : బత్తాయి, నిమ్మ మొక్కలను 7్ఙశ్రీ7 మీటర్ల దూరంలో నాటుతాం. కాబట్టి కాపునకు వచ్చే ఐదు సంవత్సరాల వరకు అంతరపంటలు సాగు చేసుకోవచ్చు. వేరుశనగ, అపరాల రకాలైన కంది, మినుము, పెసరలతోపాటు దోస, ఉల్లి, పుచ్చ పంటలు వేసుకోవచ్చు. మిరుప, టమాటో, వంగ పైర్లు వేయకూడదు. ఈ పైర్లు వేయడం వల్ల నులిపురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది.
సపోటా : సపోటాను కూడా 7్ఙశ్రీ7 మీటర్ల దూరంలో నాటుకోవడం వల్ల అంతరపంటలుగా బొప్పాయి, మునగ లాంటి పంటలు వేసుకోవచ్చు. కూరగాయల పంటలైన టమాట వంగ, దోసలను కూడ సాగుచేయొచ్చు. చెట్ల వరుస మధ్యలో కొందరు ఎర్రచందనం, శ్రీగంధం కూడా సాగు చేసుకోవచ్చు.
బిందు సేద్యం ద్వారా అంతర పంటల సాగు
పండ్లతోటల్లో అంతరపంటల సాగులో కొన్ని మెళుకువలు పాటించాల్సి ఉంటుంది. ప్రధానంగా డ్రిప్ ద్వారా నీరందించినప్పుడు అంతరపంటల సాగుకు ప్రత్యేకంగా లాటరల్ పైపు లైన్ వేసుకోవాలి. దీని ద్వారా ప్రధాన పంటకు, అంతరపంటకు వేర్వేరుగా సరిపడా నీరు అందించవచ్చు.
ఫ అంతర పంటల సాగుపై
వ్యవసాయాధికారి సూచనలు

అంతర పంటలతో అధిక ఆదాయం