
ఉపాధ్యాయ దినోత్సవం రోజే విషాదం
ఆలేరు: ఉపాధ్యాయ దినోత్సవం రోజే ఓ టీచర్ మృతి చెందారు. అతని కుటుంబాన్ని విషాదంలో ముంచింది. శుక్రవారం అస్వస్థతకు గురై చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రిని ఆశ్రయించిన సదరు ఉపాధ్యాయుడు మృతి చెందిన సంఘటన ఆలేరు పట్టణంలో జరిగింది. వైద్యం వికటించడమే టీచర్ మృతికి కారణమని కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపించారు. మృతదేహాంతో ఆసుపత్రి ఎదుట బైఠాయించారు. ఈ ఘటనకు సంబంధించి కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా.. యాదగిరిగుట్ట మండలం కమటంగూడేనికి చెందిన ఏనుగుల ఉదయ్‌కుమార్(42) భువనగిరిలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య కావేరి, మోహన, ఆద్య ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. శుక్రవారం సాయంత్రం ఉదయ్‌కుమార్‌కు ఛాతిలో నొప్పి రావడంతో అతన్ని చికిత్స కోసం ఆలేరులోని ఓ నర్సింగ్‌హోంకు కుటుంబసభ్యులు తీసుకువచ్చారు. నొప్పి తగ్గేందుకు నర్సింగ్‌హోం డాక్టర్ సూచన మేరకు ఉదయ్‌కి ఆసుపత్రి సిబ్బంది ఇంజెక్షన్ ఇచ్చారు. ఇంటికి వెళుతున్న క్రమంలో ఉదయ్‌కు నొప్పి రావడంతో మళ్లీ ఆసుపత్రికి వచ్చాడు. ఫిట్స్ వస్తున్నాయనే అనుమానంతో నర్సింగ్‌హోం వర్గాలు ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశాయి. ప్రభుత్వ ఆసుపత్రికి వెళుతున్న క్రమంలో ఉదయ్ మార్గమధ్యలో మృతి చెందాడు. ఆసుపత్రికి వచ్చిన ఉదయ్‌కుమార్‌ను డ్యూటీ డాక్టర్ పరీక్షించగా అప్పటికే మృతి చెందాడని నిర్ధారించినట్టు ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ స్వప్న రాథోడ్ ‘సాక్షి’కి తెలిపారు.
ఆగ్రహించిన కుటుంబసభ్యులు
ఆగ్రహించిన కుటుంబసభ్యులు నర్సింగ్‌హోంకు వచ్చి వైద్యం వికటించడం వల్లనే ఉదయ్ మరణించాడని డాక్టర్ ప్రతాప్‌రెడ్డితో వాదనకు దిగారు. నొప్పి తగ్గటానికే ఇంజెక్షన్ ఇచ్చానని డాక్టర్ వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. సమాచారం తెలుసుకున్న వామపక్షాల నాయకులు ఆసుపత్రికి చేరుకొని నర్సింగ్‌హోం వర్గాల తీరును తప్పుబట్టారు. సరైన పరీక్షలు చేయకుండానే ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల వైద్యం వికటించడమే ఉదయ్ మరణానికి కారణమని, డాక్టర్‌పై చర్య తీసుకోవాలన్నారు. జిల్లా వైద్యాధికారి వచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాత్రి వరకు ఆసుపత్రి వద్ద రోడ్డుపై బైఠాయించి కుటుంబసభ్యులతో కలిసి నాయకులు ఆందోళనకు దిగారు. ట్రాఫిక్‌కు కాసేపు అంతరాయం కలిగి, పరిస్థితి గందగోళంగా మారడంతో సీఐ యాలాద్రి, ఎస్‌ఐ వినయ్‌లు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపు చేసేందుకు కృషి చేశారు. భార్య కావేరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, దర్యాప్తు అనంతరం డాక్టర్ ప్రతాప్‌రెడ్డిని అరెస్టు చేస్తామని సీఐ చెప్పారు.మృతికి గుండెపోటా? అసలు కారణం పోస్టుమార్టం తర్వాతనే తెలుస్తుందని సీఐ తెలిపారు.
పరిహారం చెల్లించాలి
ఉదయ్‌కుమార్ కుటుంబానికి రూ.50లక్షల పరిహారం చెల్లించాలని బీజేపీ జిల్లా కార్యదర్శి కామిటికారి కృష్ణ డిమాండ్ చేశారు. సుధా నర్సింగ్‌హోంలో గతంలో కూడా అనేక సంఘటనలు జరిగాయని కలెక్టర్, వైద్యాధికారులు విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఫ ఆలేరులో ప్రైవేట్ టీచర్ మృతి
ఫ వైద్యం వికటించడమే కారణమని కుటుంబ సభ్యుల ఆరోపణ
ఫ నర్సింగ్‌హోం ఎదుట ఆందోళన