
ప్రజల దృష్టి మళ్లించేందుకే కుట్రలు
భువనగిరి: ఆచరణకు సాధ్యం కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుందని మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, గొంగిడి సునీత, భిక్షమయ్యగౌడ్ విమర్శించారు. హామీలను అమలు చేయకుండా ప్రజల దృష్టిని మరల్చేందుకు కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో భువనగిరిలో రాస్తారోకో నిర్వహించి సీఎం రేవంత్‌రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసీఆర్‌ను బదనాం చేయడమే పనిగా పెట్టుకుందన్నారు. రాష్ట్రంలో సాగు నీటి కష్టాలు తీర్చేందుకు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని గుర్తు చేశారు. జిల్లాను సస్యశ్యామలం చేయటానికి బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మించారని, గంధమల్ల రిజర్వాయర్‌కు ఆనాడే ప్రతిపాదనలు రూపొందించారని గుర్తు చేశారు. కేసీఆర్ చరిష్మాను ఎవ్వరూ తగ్గించలేరని, కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి పేరుతో కాంగ్రెస్ చౌకబారు రాద్ధాంతం చేస్తుందన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా కేసీఆర్ తెలంగాణ ప్రజల నుంచి దూరం చేయలేరని పేర్కొన్నారు. అంతకు ముందు బస్వాపురం రిజర్వాయర్ నుంచి తీసుకువచ్చిన నీటితో తెలంగాణతల్లి విగ్రహానికి అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర్లరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ జడల అమరేందర్, రైతు సమన్వయ సమితి మాజీ జిల్లా కో ఆర్డినేటర్ కొల్పుల అమరేందర్, మున్సిపల్ మాజీ చైర్మన్ అంజనేయులు, పార్టీ పట్టణ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఏవీ కిరణ్‌కుమార్‌రెడ్డి, రచ్చ శ్రీనివాస్‌రెడ్డి, ర్యాకల శ్రీనివాస్ మండల కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు, మాజీ ప్రజా ప్రతినిధులు, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఫ ఎవరెన్ని చేసినా కేసీఆర్‌ను తెలంగాణ ప్రజల నుంచి దూరం చేయలేరు
ఫ మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి,
గొంగిడి సునీత, భిక్షమయ్యగౌడ్