
గణేషా.. గస్తీ గాడి తప్పింది!
చౌటుప్పల్ : పెట్రోలింగ్ పోలీసులకు గణేష్ నవరాత్రులు కాసులు కురిపిస్తున్నాయి. నిబంధనల పేరిట అందినకాడికి దండుకుంటున్నారు. మండపాల నిర్వాహకులు చేసేది లేక పోలీసులు అడిగినంత ఇవ్వక తప్పడం లేదు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా మండపాల వద్ద, శోభయాత్రలో డీజేలకు పోలీస్ శాఖ అనుమతులు నిరాకరించింది. అయితే జోష్ నింపాలంటే డీజేల తప్పనిసరి కావడంతో నిబంధనలు ఒప్పుకోకున్నా.. ఉత్సవ కమిటీలు డీజేలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇదే అదనుగా పెట్రోలింగ్ పోలీసులు చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. మండపాల వద్ద, శోభాయాత్రలో డీజేలు ఏర్పాటు చేసినట్లు తెలిసిందే తడవుగా అక్కడికి చేరుకొని కేసులు నమోదు చేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఆ తర్వాత బేరసారాలు మాట్లాడుకుంటున్నారు. అంకిరెడ్డిగూడెంలో హడావుడి
చౌటుప్పల్ మండల పరిధిలోని అంకిరెడ్డిగూడెంలోని ఈదమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడిని ఆదివారం రాత్రి నిమజ్జనానికి తరలించారు. తంగడపల్లికి చెందిన యువకులు డీజే వాహనం ఏర్పాటు చేశారు. డీజే పెట్టారన్న విషయం తెలియడంతో పెట్రోలింగ్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అనుమతులు లేవని, కేసులు నమోదు చేస్తామని కాసేపు హడావుడి చేశారు. నిర్వాహకుల నుంచి రూ.5 వేలు వసూలు చేశారు. డీజే నిర్వాహకులనూ వదల్లేదు. వెయ్యి రూపాయలు అడగగా వారు రూ.500 సమర్పించుకున్నట్లు తెలిసింది. దాంతో డీజే సజావుగా కొనసాగింది. ఇదే పరిస్థితి మండల వ్యాప్తంగా ఉన్నట్లు మండపాల నిర్వాహకులు ఆరోపిస్తున్నారు.
పెట్రోలింగ్ పోలీసులకు కాసుల వర్షం
ఫ వినాయక మండప నిర్వాహకుల నుంచి డబ్బులు డిమాండ్
ఫ డీజేలకు అనుమతి లేదంటూ వసూళ్లు