
శ్రీశైలం దర్శనానికి వెళ్లొస్తూ..
శాలిగౌరారం: ట్రావెల్స్ వాహనంలో శ్రీశైలం మల్లికార్జునస్వామి దర్శనానికి వెళ్లొస్తూ.. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఆటోను ఢీకొట్ట డంతో ఒకరు మృతిచెందారు. మరో 13 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన 365వ నంబర్ జాతీయ రహదారిపై శాలిగౌరారం మండలం మాధారంకలాన్ గ్రామం వద్ద సోమవారం తెల్ల వారుజామున జరిగింది. స్థానిక ఎస్‌ఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ మండలం పత్తిపాక గ్రామ పంచాయతీ పరిధిలోని వినాయకతండాకు చెందిన 14 మంది తాపీమేసీ్త్రలు ట్రావెల్స్ వాహనంలో ఆదివారం శ్రీశైలం మల్లికార్జునస్వామి దర్శనానికి వెళ్లారు. దర్శనం అనంతరం వీరు తిరిగి స్వగ్రామానికి వస్తుండగా.. డ్రైవర్ గుండెపాక నవీన్ అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ సోమవారం తెల్లవారుజామున 365వ నంబర్ జాతీయ రహదారిపై శాలిగౌరారం మండలం మాధారంకలాన్ గ్రామం వద్ద రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఆటోను ఢీకొట్టాడు. దీంతో ట్రావెల్స్ వాహనం రహదారి పక్కన ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న బానోతు మంగీలాల్(47) తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. బానోతు రమేశ్, బానోతు లాలూ, భూక్య సర్వం, అంబోతు శ్రీను, గుగులోతు నరేశ్, భూక్య వీరన్‌కు తీవ్రగాయాలు కాగా.. మరో ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో నకిరేకల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి భార్య బానోతు పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఆటోను ఢీకొట్టిన ట్రావెల్స్ వాహనం
ఒకరు మృతి, 13 మందికి గాయాలు

శ్రీశైలం దర్శనానికి వెళ్లొస్తూ..