
గంజాయి రవాణా చేస్తున్న నలుగురి అరెస్ట్
నార్కట్‌పల్లి: బైక్‌ల నంబర్ ప్లేట్స్ మారుస్తూ ఒరిస్సా నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న నలుగురిని అరెస్ట్ చేసినట్లు నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. సోమవారం నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు వివరాలను ఆయన విలేకరులకు వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై నార్కట్‌పల్లి మండల పరిధిలోని వివేరా హోటల్ ఎదుట సోమవారం తెల్లవారుజామున పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. రెండు బైక్‌లపై ఒరిస్సాలోని మల్కాన్‌గిరికి చెందిన జీబన్ డెపారి, కిరన్ బైధ్యా, సుధాషేన్ సాలేతో పాటు మరో బాలుడు హైదరాబాద్ వైపు వెళ్తూ అనుమానాస్పదంగా కనిపించారు. వారిని ఆపి తనిఖీ చేయగా 7 కిలోల గంజాయి లభ్యమైంది. అంతేకాకుండా రెండు బైక్‌ల నంబర్ ప్లేట్స్ అసలైనవి కావని పోలీసులు గుర్తించారు. నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా.. బాదల్ దాకువ అనే వ్యక్తి ఒరిస్సాలోని మల్కాన్‌గిరిలో ఉంటూ సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో అక్కడ తక్కువ ధరకు గంజాయి కొని హైదరాబాద్‌లో ఎక్కువ ధరకు విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో గంజాయి అవసరం ఉన్న వారితో పరిచయం పెంచుకున్నాడు. ఎక్కువ మొత్తంలో గంజాయి తరలిస్తే పోలీసులు పట్టుకుంటారని భావించి ఒరిస్సాకు చెందిన కొంతమందిని ఎంపిక చేసుకుని, బైక్‌ల నంబర్ ప్లేట్స్ మార్చి 7 నుంచి 10 కేజీల గంజాయి హైదరాబాద్‌కు తరలిస్తున్నాడు. గంజాయి తరలించే వారికి రోజుకు ఒక్కొక్కరికి రూ.3వేలు ఇస్తున్నాడు. ఈ క్రమంలో జీబన్ డెపారి, కిరణ్ బైధ్యా, సుధాషేన్ సాతే, మరో బాలుడు కలిసి బాదల్ దాకువతో ఒప్పందం చేసుకుని బైక్‌ల నంబర్ ప్లేట్స్ మార్చి ఒరిస్సా నుంచి హైదరాబాద్‌కు 7 కిలోల గంజాయిని బైక్ డిక్కీ, సీటు కింద పెట్టుకుని తరలిస్తుండగా పట్టుబడినట్లు డీఎస్పీ తెలిపారు. నలుగురు నిందితుల నుంచి రెండు బైక్‌లు, 7 కిలోల గంజాయి స్వాధీనం చేసుకొని నలుగురిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు డీఎస్పీ తెలిపారు. బాదల్ దాకువ అనే వ్యక్తిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో నార్కట్‌పల్లి సీఐ నాగరాజు, ఎస్‌ఐ క్రాంతికుమార్, పోలీస్ సిబ్బంది రాము, జవహర్, రమేష్, సత్యనారాయణ, శ్రీకృష్ణ, శివ, తిరుమలేష్ ఉన్నారు.
నిందితుల్లో ఒకరు మైనర్
7 కిలోల గంజాయి స్వాధీనం