
బీటీ పత్తిని ఆశించే పురుగులు – నివారణ చర్యలు
పెద్దవూర: రైతులు బీటీ పత్తి సాగులో సరైన యాజమాన్య పద్ధతులు పాటించటం వలన అధిక దిగుబడులు సాధించవచ్చని పెద్దవూర మండల వ్యవసాయ అధికారి పి. సందీప్‌కుమార్ సూచిస్తున్నారు. సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టడంతో పాటు సేంద్రియ ఎరువుల వాడటం, అధికారులు సిఫారసు చేసిన పురుగు మందులను వాడాలని ఆయన పేర్కొంటున్నారు.
రసం పీల్చే పురుగులు
– తొలి దశ(1 నుంచి 60 రోజులు): బీటీ పత్తి పంటలో తొలి దశలో రసం పీల్చే పురుగులైన పచ్చదోమ, పేనుబంక, తామర పురుగులు ఆశించకుండా విత్తన శుద్ధి చేయాలి. దీని వలన దాదాపు 30 రోజుల వరకు పురుగులను అరికట్టవచ్చును. విత్తన దుకాణాల్లో లభించే అన్ని రకాల అనుమతి పొందిన బీటీ వంగడాలు విత్తన శుద్ధి చేసినవే లభిస్తాయి. ఒకవేళ విత్తన శుద్ధి చేయకపోతే ఇమిడాక్లోప్రిడ్ 70 డబ్ల్యూఎస్ లేదా థయామిథాక్సామ్ 70 డబ్ల్యూఎస్ మందులను ఒక కిలో విత్తనానికి 4 నుంచి 5 గ్రాముల వరకు కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. నత్రజని ఎరువులను సరైన మోతాదులో సకాలంలో వేయకపోతే పురుగు ఉధృతి ఎక్కువ అవుతుంది. సేంద్రియ ఎరువులను విధిగా ఉపయోగించటం వలన నేల సత్తువ పెరుగుతుంది. అంతర పంటలైన సోయాచిక్కుడు, పెసర, మినుము, బొబ్బర, కొర్ర వంటి పంటలను సాగు చేయడం ద్వారా మిత్ర పురుగులు బాగా వృద్ధి చెంది కొంతవరకు రసం పీల్చు పురుగుల నియంత్రణకు దోహదపడతాయి.
పూత పద్ధతి: తొలి దశలో ఆశించే పురుగులను అదుపు చేయటానికి కాండం మీద పూత పద్ధతిని పాటించాలి. 3 పర్యాయాలు 30, 45 రోజులలో మోనోక్రోటోఫాస్ 1:4(ఒక భాగం మందు, 4 భాగాలు నీళ్లు) నిష్పత్తిలో వాడాలి. తిరిగి 60 రోజుల వయసులో ఇమిడాక్లోప్రిడ్ 1:20 నిష్పత్తిలో(ఒక పాళ్లు మందు, 20 పాళ్లు నీరు) వాడాలి. కాండం, పూత పద్ధతి ద్వారా పచ్చదోమ, పేనుబంక, పిండినల్లి పురుగులను ఎటువంటి పురుగు మందులు లేకుండా 70–80 రోజుల వరకు అదుపు చేసుకోవచ్చు. మందులను పిచికారీ చేయకపోవడం వలన తొలిదశలో మిత్ర పురుగుల సంతతి పెరిగి చీడపీడలను అదుపు చేయడంలో సహకరిస్తాయి. రసం పీల్చు పురుగుల నివారణకు 5శాతం వేపగింజల కషాయం వాడాలి.
కాయ తొలుచు పురుగు
60 నుంచి 90 రోజుల పంట దశలో పత్తి పైరులో సాధారణంగా పూత ఏర్పడిన దగ్గరి నుంచి కాయ తొలుచు పురుగులు ఆశించటం మొదలవుతుంది. ముఖ్యంగా తలనత్త, శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగులు పంటను వివిధ దశల్లో ఆశించి తీవ్ర నష్టం కలిగిస్తాయి. ఎకరంలో 50 శాతం మొక్కల్లో కనీసం ఒక్కొక్క మొక్కను ఒక గూడ కంటే ఎక్కువ నష్టపోతే (పురుగు చేసిన రంధ్రంతో విచ్చుకున్న గూడలు) 5శాతం వేపగింజల కషాయం పిచికారీ చేస్తే శనగపచ్చ పురుగు గుడ్లను, మొదటి దశ గొంగళి పురుగులను సమర్ధవంతంగా నివారించవచ్చు. బీటీ క్రిమిసంహారక మందులను బీటీ వంగడాలపై వాడకూడదు. వృక్ష మందులైన వేపగింజల కషాయం 5 శాతం లేదా 0.5 శాతం వేపనూనె లేదా 0.2 నుంచి 0.5 శాతం పిచికారీ చేయవచ్చు. పొగాకు లద్దె పురుగు నివారణకు లీటరు నీటికి 1.0 మి.లీ. నోవల్యూరాన్ లేదా 1.0 మి.లీ. లూఫెన్యూరాన్ లేదా ఇమామెక్టీన్ బెంజోయోట్‌ను 0.5 మి.లీ. పిచికారీ చేయాలి.
ఆశించు దశ: 90 నుంచి 120 రోజుల దశలో శనగపచ్చ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. 90 రోజుల నుంచి బీటీ పత్తిలో గూడ, పిందెలలో ఉండే బీటీ ప్రోటీన్ స్థాయి క్రమేపి తగ్గుతూ ఉండటం వలన శనగపచ్చ పురుగుల నియంత్రణ తగ్గుతూ ఉంటుంది. ఈ దశలో ఏవైనా గొంగళి పురుగుల నష్టపరిమితి స్థాయి గమనిస్తే 1 లేదా 2 పర్యాయాలు క్రిమి సంహారక మందులు ఉపయోగించటం ద్వారా పురుగును అదుపు చేయవచ్చు. థయోడికార్బ్ 1.5 గ్రాములు లేదా క్వినాల్‌ఫాస్ 2.0 మి.లీ. లేదా క్లోరిఫైరిపాస్ 2.5 మి.లీ. ను పిచికారీ చేయాలి. రెండోసారి పిచికారీగా సైపనోసాడ్ 0.3 మి.లీ. లేదా ఇండాక్సకార్బ్ 1.0 మి.లీ. చొప్పున ఒక లీటరు నీటికి కలిపి ఏదో ఒక మందును మార్చి మార్చి పిచికారీ చేయాలి. తెల్లదోమ నివారణకు సిఫార్సు చేసిన పురుగు మందులను 3 మి.లీ. వేపనూనె కలిపి పిచికారీ చేయాలి. రసం పీల్చు పురుగుల నివారణకు 1.5 గ్రాముల ఎసిఫేట్ లేదా 2.0 మి.లీ. ఫిప్రోనిల్ లేదా .03 గ్రాముల ఫ్లోనికామిడ్ లేదా 1.25 గ్రాముల డైఫెనిథియురాన్ లీటరు నీటికి కలిపి వాడాలి.
గులాబీ రంగు, పిండినల్లి పురుగు
120 రోజుల తర్వాత పత్తి పంటలో గులాబీ రంగు పురుగు, పిండినల్లి ఉధృతి ఎక్కువగా ఉంటుంది. గులాబీ రంగు పురుగు నష్టపరిమితి స్థాయిని గమనించి పత్తి పంటలో అక్కడక్కడా కొన్ని కాయలను కోసి తెరిచి చూడాలి. పది కాయలకు ఒక లార్వా ఉంటే నష్టపరిమితి స్థాయి అధికంగా ఉన్నట్లు గుర్తించాలి. అవసరం మేరకు పంట చివరి దశలో ఒకటి లేదా రెండు పర్యాయాలు సింథటిక్ పైరిత్రాయిడ్ మందులను పిచికారీ చేయడం ద్వారా గులాబీ రంగు పురుగును నివారించవచ్చు. అదేవిధంగా పెద్ద గొంగళి పురుగులను ఏరి నాశనం చేయాలి. పిండినల్లి నివారణకు ఎసిఫేట్ లేదా ప్రొఫెనోపాస్ మందులను వాడాలి. పంట విత్తిన వెంటనే 45 రోజుల నుంచి గులాబీ రంగు పురుగు ఉనికిని గమనించినట్లయితే ఎకరాకు 4 నుంచి 8 లింగాకర్షక బుట్టలను పెట్టాలి. బుట్టలో 8 తల్లి రెక్కలు పడినట్లయితే వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.

బీటీ పత్తిని ఆశించే పురుగులు – నివారణ చర్యలు