
విషపూరితమైన మొక్కలు తిని 150 గొర్రెలు మృతి
మునగాల: విషపూరితమైన మొక్కలు తిని సుమారు 150 గొర్రెలు మృతిచెందాయి. ఈ ఘటన మునగాల మండలం మొద్దులచెరువు గ్రామ స్టేజీ సమీపంలో సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా దువ్వాడ మండలం హానుమాన్‌పల్లి గ్రామానికి చెందిన కొర్ల శివకుమార్‌కు చెందిన గొర్రెల మంద మేత కోసం కొంతకాలం క్రితం మునగాల మండలం చేరుకుంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం మేతకు వెళ్లి వచ్చిన గొర్రెల మందలోని 150 గొర్రెలు సాయంత్రం అకస్మాత్తుగా మృత్యువాత పడ్డాయి. గొర్రెల కాపరులు మండలంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ పశువైద్యాధికారికి సమాచారం ఇవ్వడంతో ఆయన వచ్చి గొర్రెలను పరిశీలించి విషపూరితమైన మొక్కలు తినడం వలన మృతిచెంది ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. మృతిచెందిన గొర్రెల విలువ రూ.15లక్షల వరకు ఉంటుందని గొర్రెల కాపరులు తెలిపారు.