
ముఖ గుర్తింపుతో పింఛన్
అమల్లోకి ఫేస్ రికగ్నేషన్
ఫ నూతన విధానంతో మొదటి రోజు ఆరుగురికి పింఛన్లు పంపిణీ
ఫ నేటి నుంచి పూర్తిస్థాయిలో..
ఫ బయోమెట్రిక్‌లో వేలిముద్రలు పడనివారికి తొలగనున్న ఇబ్బందులు
భువనగిరి: బయోమెట్రిక్‌లో వేలిముద్రలు పడని చేయూత లబ్ధిదారులకు ఇబ్బందులు తొలగనున్నాయి. ఇకనుంచి ఫేస్ రికగ్నేషన్ ద్వారా పింఛన్లు పంపిణీ చేయనున్నారు.రాష్ట్రం ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఈ విధానం సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. జిల్లా వ్యాప్తంగా 99,287 మంది చేయూత లబ్ధిదారులు ఉండగా మొదటి రోజు పోస్టాఫీసుల్లో ఆరుగురికి ముఖ గుర్తింపు ద్వారా పింఛన్లు పంపిణీ చేశారు.
ప్రత్యేకంగా మిత్ర యాప్
పింఛన్లు తీసుకునే సమయంలో బయోమెట్రిక్ యంత్రంలో వేలిముద్రలు పడక వృద్ధులు ఇబ్బందులు పడేవారు. ఇటువంటి వారికి పంచాయతీ కార్యదర్శి వేలిముద్రలు తీసుకుని పింఛన్ అందజేసేవారు. దీనివల్ల పింఛన్ల పంపిణీ అలస్యం అయ్యేది. ప్రస్తుతం ముఖ గుర్తింపు విధానం అమలు చేయడం వల్ల సులభంగా, నేరుగా పింఛన్ పొందనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా మిత్ర యాప్‌ను రూపొందించింది. ఈ యాప్‌ను పోస్టల్ ఉద్యోగుల సెల్‌ఫోన్లలో ఇన్‌స్టాల్ చేశారు. ఈ యాప్ ద్వారా లబ్ధిదారు ముఖాన్ని ఫొటో తీసి ఆధార్ అనుసంధానంగా ఉన్న ఫొటోను సరిచూసి యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు.
అక్రమాలకు అడ్డకట్ట
జిల్లా వ్యాప్తంగా 99,287 మంది పింఛన్‌దారులు ఉన్నారు. ఇందులో చాలావరకు పోస్టాఫీస్‌ల ద్వారా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. వేలిముద్రలు పడనివారు, అనారోగ్యంతో మంచానికి పరిమితమైన లబ్ధిదారులకు పంచాయతీ కార్యదర్శులు తమ వేలిముద్రల సహాయంతో పింఛన్ పంపిణీ చేస్తున్నారు. దీని వల్ల అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో పింఛన్ల పంపిణీలో పారదర్శకత ఉండేలా ప్రభుత్వం ఫేస్ రికగ్నేషన్ విధానం తీసుకువచ్చింది. నూతన విధానాన్ని జిల్లాలోని అన్ని పోస్టల్ కార్యాలయాల్లో అమలు చేసేందుకు జిల్లా గ్రామీఽణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సన్నాహాలు చేస్తున్నారు.
పారదర్శకత ఉంటుంది
చేయూత లబ్ధిదారులకు ఫేస్ రికగ్నేషన్ ద్వారా పింఛన్లు పంపిణీ చేసే విధానాన్ని జిల్లాలో సోమవారం అమల్లోకి తీసుకువచ్చాం. నేటినుంచి నూతన విధానంతోనే పింఛన్ల పంపిణీ ఉంటుంది. ఇందుకోసం పోస్టల్ ఉద్యోగులు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణి ఇచ్చాం. ఇప్పటికే కొందరి సెల్‌ఫోన్లలో మిత్ర యాప్ ఇన్‌స్టాల్ చేశాం. నూతన విధానం వల్ల పింఛన్ డబ్బుల పంపిణీలో పారదర్శకత ఉంటుంది. అక్రమాలకు తావుండదు.
–నాగిరెడ్డి, డీఆర్‌డీఓ