
కాంగ్రెస్.. పదవుల రేస్
సాక్షి, యాదాద్రి: అధికార కాంగ్రెస్‌లో సంస్థాగత ఎన్నికలు ఆసక్తిని రేపుతున్నాయి. పట్టణ, మండల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్ష పదవుల కోసం పెద్ద సంఖ్యలో నాయకులు పోటీ పడుతున్నారు. ఎవరికి వారు ఎమ్మెల్యేలు, అధిష్టానం వద్ద లాబీయింగ్ చేసుకుంటున్నారు. వీరిలో ఎవరికి అవకాశం దక్కుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఈనెల 30 లోగా నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి కమిటీలకు ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉంది. ఆలేరు, తుంగతుర్తిలో సమావేశాలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరిస్తుండగా.. భువనగిరి, మునుగోడులో పెండింగ్‌లో ఉన్నాయి.
ఆలేరు నియోజకవర్గంలో ఇదీ పరిస్థితి
ఆలేరు నియోజకవర్గంలో ఎనిమిది మండలాలు, రెండు పట్టణ కమిటీలకు అధ్యక్షులను ఎన్నుకోవాల్సి ఉంది. ఇందులో యాదగిరిగుట్ట పట్టణం, యాదగిరిగుట్ట మండలం, తుర్కపల్లి మండల అధ్యక్షుల ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ మూడు చోట్ల అధ్యక్షులను నియమించే నిర్ణయాన్ని స్థానిక ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యకు వదిలేశారు. ఎమ్మెల్యే ఎవరిని నియమించినా తామంతా అంగీకరిస్తామని డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, పీసీసీ పరిశీలకుల సమక్షంలో జరిగిన సమావేశంలో నాయకులు స్పష్టం చేశారు. అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నట్లు ఎవ్వరూ పేర్లు ఇవ్వకపోవడంతో ఆ మూడు చోట్ల ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇక బొమ్మలరామారంలో 22, గుండాల 22 మంది, ఆలేరు పట్టణం, ఆలేరు మండలం, మోటకొండూరు, ఆత్మకూర్ (ఎం, రాజాపేటలో పదులసంఖ్యలో అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్నారు.
తుంగతుర్తిలో పదుల సంఖ్యలో దరఖాస్తులు
తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించి మోత్కూరు, అడ్డగూడూరు మండలాల నాయకులు, ముఖ్య కార్యకర్తలతో ఈనెల 10వ తేదీన సమావేశం ఏర్పాటు చేశారు. కానీ, గొడవ చోటు చేసుకోవడంతో దరఖాస్తుల స్వీకరణ వాయిదా పడింది. గురువారం మరోసారి సమావేశం నిర్వహించారు. అడ్డగూడూరు, మోత్కూరు మండలాల నుంచి ఆరుగురు చొప్పున దరఖాస్తు చేసుకున్నారు. మోత్కూరు పట్టణ అధ్యక్ష పదవికోసం 10 మంది దరఖాస్తులు అందజేశారు.
బ్లాక్ కాంగ్రెస్ పదవులకు భారీగానే..
భువనగిరి, ఆలేరు, మునుగోడు నియోజకవర్గాల్లోని ఐదు బ్లాక్ కాంగ్రెస్ స్థానాలు ఉన్నాయి. అలేరు, యాదగిరిగుట్ట, భువనగిరి, భూదాన్‌పోచంపల్లి, చౌటుప్పల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్ష పదవుల కోసం పెద్ద సంఖ్యలో నాయకులు పోటీపడుతున్నారు.
గ్రామ, వార్డు కమిటీలపై ప్రత్యేక దృష్టి
మండల, పట్టణ కమిటీలకు అధ్యక్షులను ఎన్నుకున్న తర్వాత గ్రామ శాఖలు, పట్టణాల్లో వార్డు కమిటీలకు అధ్యక్షులను, కార్యవర్గాలను ఎన్నుకోనున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా గ్రామ, వార్డు కమిటీలకు ప్రాధాన్యం ఏర్పడింది. సారధ్య బాధ్యతల కోసం యువత ఎక్కువగా పోటీ పడుతోంది. నూతనంగా ఎన్నికై న మండల, పట్టణ అధ్యక్షులు గ్రామ, వార్డుల్లో కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి అశావహుల పేర్లను తీసుకుంటారు. ఇక్కడ కూడా ఏకగ్రీవమైన వారితో పాటు పోటీపడుతున్న నాయకుల పేర్లను పీసీపీకి పంపిస్తారు.
ఆసక్తిరేపుతున్న పార్టీసంస్థాగత ఎన్నికలు
ఫ పట్టణ, మండల, బ్లాక్ కమిటీ అధ్యక్ష పదవులకు తీవ్ర పోటీ
ఫ ఆలేరు, తుంగతుర్తిలో దరఖాస్తుల స్వీకరణ
ఫ పలు చోట్ల 20 మందికి పైగా ఆశావహులు
ఫ ఎమ్మెల్యేల వద్ద లాబీయింగ్
భువనగిరి, మునుగోడు ఆలస్యం
భువనగిరి, మునుగోడు నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. రెండు, మూడు రోజుల్లో పూర్తి చేస్తామని డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి ‘సాక్షి’తో చెప్పారు. శనివారం నుంచి భువనగిరి లేదా మునుగోడు నియోజకవర్గంలో మండలం, పట్టణవాల వారీగా సమావేశాలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. కాగా భువనగిరి, భూదాన్‌పోచంపల్లి, చౌటుప్పల్ పట్టణాలతో పాటు అన్ని మండలాల్లో పెద్ద సంఖ్యలో నాయకులు పోటీ పడుతున్నారు.
జోరుగా ప్రయత్నాలు
పదవుల కోసం నేతల ప్రయత్నాలు జోరందుకున్నాయి. ఎమ్మెల్యేల అండదండలు ఉన్నవారికి పదవులు దక్కే అవకాశం ఉండటంతో వారి వద్దకు చక్కర్లు కొడుతున్నారు. కాగా ఆశావహుల్లో కొత్తగా చేరిన వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కాగా కూడా పదవులు ఆశిస్తూ తమ గాడ్‌ఫాదర్‌లను ఆశ్రయిస్తున్నారు. కాగా దరఖాస్తుల్లో ప్రతిపాదించిన పేర్లను పీసీసీ ఫైనల్ చేయనుంది.