
నిధుల్లేక.. పనులు పట్టాలెక్కక..
తొమ్మిదేళ్లుగా కదలని ఎంఎంటీఎస్
సాక్షి, యాదాద్రి : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి క్షేత్రానికి రోజురోజుకూ భక్తుల తాకిడి పెరుగుతోంది. ప్రధానంగా హైదరాబాద్ నుంచి నిత్యం వేలాది భక్తులు వస్తుంటారు. కానీ, సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో స్వామి సన్నిధికి చేరుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. భక్తుల సౌకర్యార్థం ఘట్‌కేసర్ నుంచి యాదాద్రి(రాయగిరి) రైల్వే స్టేషన్ వరకు తొమ్మిదేళ్ల క్రితం ఎంఎంటీఎస్ మంజూరైనా నేటికీ పట్టాలెక్కలేదు. రూ.400 కోట్లతో త్వరలోనే పనులు ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేసిన ప్రకటనతో ఎంఎంటీఎస్‌పై ఆశలు చిగురిస్తున్నాయి.
2016లో మంజూరు
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పునఃనిర్మాణం తరువాత భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని భావించిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్.. ఎంఎంటీఎస్‌ను ఘట్‌కేసర్ నుంచి రాయగిరి వరకు పొడిగించాలని ప్రధాని మోదీని కోరారు. అలాగే రాయగిరి స్టేషన్ పేరును యాదాద్రి స్టేషన్‌గా మార్చాలని విన్నవించగా మోదీ ఆమోదించారు. యాదాద్రి రైల్వే స్టేషన్ వరకు 2016లో ఎంఎంటీఎస్ ప్రాజెక్టు మంజూరైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రాజెక్టు చేపట్టాల్సి ఉండగా మోక్షం కలగలేదు. భూసేకరణ చేయకపోవడంతో పాటు రాష్ట్రం తన వాటా నిధులు కేటాయించడం లేదని కేంద్రం.. పూర్తి నిధులతో కేంద్ర ప్రభుత్వమే ప్రాజెక్టు చేపట్టాలని రాష్ట్రం వాదులాడుకుంటూ వచ్చాయి. ఫలితంగా ఎంఎంటీఎస్ జిల్లా ప్రజలకు కలగానే మిగిలింది.
ఘట్‌కేసర్ వద్ద ఆగిన రెండో దశ పనులు
ఎంఎంటీఎస్ రెండో దశ పనులు ఘట్‌కేసర్ వద్దకు వచ్చి ఆగిపోయాయి. భూసేకరణతో పాటు నిధుల కొరత పనుల జాప్యానికి కారణంగా మారింది. రూ.400 కోట్లతో త్వరలోనే ఎంఎంటీఎస్ పనులను పట్టాలెక్కిస్తామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించారు. గురువారం హైదరాబాద్‌లోని బేగంపేట రైల్వేస్టేషన్ పునరాభివృద్ధి పనులను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈసందర్భంగా స్టేషన్ ప్రాంగణంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కిషన్‌రెడ్డ్డి యాదాద్రి ఎంఎంటీఎస్‌పై ప్రకటన చేశారు.
ఫ యాదగిరి శ్రీలక్ష్మీనరసింహ స్వామి
క్షేత్రానికి భారీగా పెరిగిన భక్తులు
ఫ సాధారణ ప్రయాణికులూ వేలల్లో..
ఫ రవాణాపరంగా అవస్థలు
ఫ రూ.400కోట్లతో పనులు ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రకటన
ఫ ప్రాజెక్టుపై చిగురిస్తున్న ఆశలు
రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది
ఘట్‌కేసర్ నుంచి యాదాద్రి రైల్వే స్టేషన్ వరకు ఎంఎంటీఎస్ ప్రాజెక్టుకు అవసరమైన భూ సేకరణకోసం రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి నిత్యం 50వేల నుంచి లక్ష మంది వరకు హైదరాబాద్ వెళ్లొస్తుంటారు. వీరిలో యాదగిరిగుట్ట క్షేత్రానికి వచ్చే భక్తులే సగానికి పైగా ఉంటారు.వీరి ప్రయాణ సౌలభ్యం కోసం ఎంఎంటీఎస్ ఎంతో అవసరం. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పూర్తి సహకారం అందిస్తుంది. –ప్రభుత్వ విప్,
ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
ఎంఎంటీఎస్ అవసరం తప్పనిసరి
యాదగిరిగుట్ట క్షేత్రానికి పెరుగుతున్న భక్తులు, ఇతర ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా జిల్లాకు ఎంఎంటీఎస్ అవసరం తప్పనిసరిగా మారింది. ప్రాజెక్టు పూర్తయితే ప్రత్యేక లైన్ ద్వారా ఎంఎంటీఎస్ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. దీంతో హైదరాబాద్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న భువనగిరికి సికింద్రాబాద్ నుంచి గంట వ్యవధిలోనే చేరుకోవచ్చు. సికింద్రాబాద్ – ఖాజీపేట సెక్షన్‌లో భువనగిరి, బీబీనగర్, ఆలేరు స్టేషన్ల మధ్య నుంచి ప్రతి రోజూ వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. సాధారణ ప్రయాణికులతో పాటు విద్యార్థులు, వ్యాపారులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, రోజు కూలీలు, యాదగిరిగుట్ట క్షేత్రానికి వచ్చే వేలాది మంది యాత్రికులు ఎంఎంటీఎస్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా బీబీనగర్ ఎయిమ్స్‌కు వచ్చే రోగులకు సౌకర్యవంతంగా ఉంటుంది.

నిధుల్లేక.. పనులు పట్టాలెక్కక..