
బునాదిగాని ఆధునీకరణ!
త్వరలో కాల్వ పనులు ప్రారంభం.. సిద్ధమవుతున్న యంత్రాంగం
సాక్షి, యాదాద్రి : బునాదిగాని కాల్వ ఆధునీకరణ పనులు ప్రారంభించేందుకు యంత్రాంగం సిద్ధమవుతోంది. కాల్వ విస్తరణ, భూసేకరణ సాధ్యాసాధ్యాలపై భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి రెండు రోజుల క్రితం రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షించారు. వానాకాలంలోగా వీలైన మేరకు పనులు పనులు చేపట్టాలని ఆదేశించారు. కాల్వ లోతు, వెడల్పు పెంచేందుకు ప్రభుత్వం ఇప్పటికే రూ.266.65 కోట్లు మంజూరు చేయగా.. టెండర్లు కూడా పూర్తయ్యాయి.
98.64 కిలో మీటర్ల పొడవు ఆధునీకరణ
భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి నియోజకవర్గాల పరిధిలోని ఐదు మండలాల్లో బునాదిగాని కాల్వను ఆధునీకరించనున్నారు. బీబీనగర్ మండలం మక్తా అనంతారం ఎర్రగుంట నుంచి బునాదిగాని కాల్వ ప్రారంభం అవుతుంది. ఇక్కడి నుంచి భువనగిరి, వలిగొండ మండలంలోని పహిల్వాన్‌పురం పెద్దచెరువు మీదుగా మోత్కూరు మండలం ధర్మారం ఊర చెరువు వరకు 98.64 కిలో మీటర్ల పొడవు కాల్వను ఆధునీకరిస్తారు. ప్రస్తుతం ఉన్న కాల్వ నీటి ప్రవాహ సామర్థ్యం 50 క్యూసెక్కులు ఉంది. ఆధునీకరణలో భాగంగా కాల్వ పొడవు, వెడల్పు చేసి 350 క్యూసెక్కులకు పెంచనున్నారు. మూడు నియోజకవర్గాల పరిధిలో భువనగిరి, వలిగొండ, ఆత్మకూర్(ఎం), మోటకొండూరు, మోత్కూరు, అడ్డగూడూరు మండలం ధర్మారం వరకు కాల్వను ఆధునీకరించనున్నారు.
భూ సేకరణే సమస్య
బునాదిగాని కాల్వ ఆధునీకరణ పనులకు భూసేకరణ అడ్డంకిగా మారే అవకాశం ఉంది. అందుకే ముందుగా భూసేకరణ అవసరంలేని చోట పనులు చేపట్టాలని నిర్ణయించారు. భూ సేకరణకు రూ.44 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం కాల్వ వెడల్పు, లోతు పెంచడానికి భూసేకరణ చేయాలి. భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేయడానికి అధికారులు సిద్ధం అవుతున్నారు.
తొమ్మిది రీచ్‌లుగా విభజన
కాల్వ ఆధునీకరణ పనులను తొమ్మిది రీచ్‌లుగా విభజించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఏదులాబాద్ నుంచి యాదాద్రి జిల్లాలోని బీబీనగర్ మక్తాఅనంతారం మీదుగా ముగ్ధుంపల్లి వరకు తొలి రీచ్ ఉండనుంది. కాల్వ ప్రారంభంలో 6.6 మీటర్ల వెడల్పు, లోతు 1.65 మీటర్లకు పెంచాలని నిర్ణయించారు. చివరి రీచ్‌లో రెండున్నర మీటర్ల మేర వెడల్పు చేయనున్నారు.
వానాకాలం లోగా కాల్వ పనులు ప్రారంభిస్తాం
మూసీ కాల్వల ద్వారా అదనపు ఆయకట్టు స్థిరీకరించడం ప్రభుత్వ లక్ష్యం. పిలాయిపల్లి, బునాదిగాని, ధర్మారెడ్డి కాల్వల ఆధునీకరణకు ఇప్పటికే ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. వానా కాలం సాగు పనులు ప్రారంభించే లోపు కాల్వ ఆధునీకరణ పనులు ప్రారంభిస్తాం. యాసంగి పంటకాలానికి ముందు కూడా కాలువ పనులు చేస్తాం. ఇలా విడుతల వారీగి రైతులకు ఇబ్బందిలేకుండా పనులుచేస్తాం. ముందుగా భూసేకరణ అవసరం లేని పనులను ప్రారంభిస్తాం. భూసేకరణకు కూడానిధులు సిద్ధంగా ఉన్నాయి. రైతులు భూసేకరణకు సహకరించాలి.
–కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి,
భువనగిరి ఎమ్మెల్యే
ఫ తొలుత భూసేకరణ లేని చోట పనులు
ఫ 350 క్యూసెక్కుల నీరు ప్రవహించేలా కాల్వ విస్తరణ
ఫ రూ.266.65 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం
పంట కాలానికి ముందే పనులు
వానాకాలంలోపే పనులు ప్రారంభించే దిశగా చర్యలు మొదలయ్యాయి. నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి బునాదిగాని కాల్వ వెంట పర్యటించి పరిశీలించారు. భూ సేకరణ సాధ్యాసాధ్యాలపై చర్చించారు. రైతులతోనూ చర్చించారు. కాల్వలో నీటి సామర్థ్యం పెరగడం వల్ల భూగర్భ జలాలు పెరగడంతో పాటు చివరి భూముల వరకు సాఫీగా నీరందుతుందని, భూ సేకరణకు సహకరించాలని రైతులకు సూచించారు. యాసంగి సీజన్ ప్రారంలోపు పనులు పూర్తికాని పక్షంలో అవసరమైతే క్రాప్‌హాలిడే తీసుకుని పనులు పూర్తి చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు.

బునాదిగాని ఆధునీకరణ!