
రామలింగాలగూడెంలో ఆదిమానవుని ఆనవాళ్లు
క్లాక్‌టవర్ (నల్లగొండ), తిప్పర్తి: నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం రామలింగాలగూడెంలోని దేవుని గుట్టపై రాతియుగపు కాలం నాటి ఆదిమానవుడి ఆనవాళ్లు ఉన్నాయని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి వెల్లడించారు. మరుగునపడిన వారసత్వ చిహ్నాలను గుర్తించి, వాటి ప్రాముఖ్యతను స్థానికులకు తెలియజేసే శ్రీప్రిజర్వ్ హెరిటేజ్ ఫర్ పోస్టెరిట్ఙీ అనే అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆయన రామలింగాలగూడెంలోని శివాలయం పక్కనే ఉన్న దేవుని గుట్టపై ఆదివారం జరిపిన పరిశీలనలో పాల్గొని మాట్లాడారు. మూడు బండలపైన కొత్త రాతియుగపు మానవులు, తాము నిత్యము వాడుకునే రాతి పనిముట్లతో ఎద్దులు, దుప్పులు, జింకలు, కుక్కలు, పులి ఇంకా ఆనాటి మానవులు వేటాడే దృశ్యాల బొమ్మల్ని తీర్చిదిద్దారన్నారు. ఈ రాతికళ క్రీ.పూ. 6000– 4000 సంవత్సరాల మధ్య కాలానికి చెందినదని ఆయన చెప్పారు. గుట్టపై సహజంగా ఏర్పడిన నీటిదోనెలు, రాతి గొడ్డళ్లను అరగ తీసుకున్న ఆనవాళ్లు కూడా ఉన్నాయన్నారు. గుట్టపై సహజంగా ఏర్పడిన పెద్ద పెద్ద బండల మాటున గల గుహల్లోనూ, పాము పడగ ఆకారంలో గల రాతి చరియల కింద నివసిస్తూ, తీరిక సమయాల్లో తాము పాల్గొన్న సంఘటనలను, చూసిన దృశ్యాలను చిత్రించారని శివనాగిరెడ్డి తెలిపారు. చారిత్రక ప్రాధాన్యత గల ఈ పురాతన రాతికళను కాపాడి, భవిష్యత్ తరాలకు తెలియజేయాలని గ్రామస్తులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో శిల్పి వెంకటేష్, మోతీలాల్ పాల్గొన్నారు.
పురావస్తు పరిశోధకుడు శివనాగిరెడ్డి