
బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు అస్వస్థత
ఆలేరు: ఆర్టీసీ బస్సు నడుపుతుండగా డ్రైవర్ అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతను వెంటనే బస్సును పక్కకు నిలపడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. శుక్రవారం జనగాం డిపోకు చెందిన ఏపీ 29 జెడ్–1715 నంబర్ గల ఆర్టీసీ బస్సు జనగాం నుంచి ఉప్పల్ క్రాస్ రోడ్‌కు బయలుదేరింది. ఈక్రమంలో ఆలేరు బస్టాండ్‌లో ప్రయాణికులను ఎక్కించుకుని సుమారు మధ్యాహ్నం 2గంటలకు బయలుదేరింది. బస్సు ఆలేరు శివారు దాటగానే డ్రైవర్ లక్ష్మయ్య అస్వస్థతకు గురయ్యాడు. తనకు కళ్లు తిరుగుతున్నాయని చెబుతూనే స్టీరింగ్ మీదకి వాలాడు. ఈ క్రమంలోనే అతను అప్రమత్తమై బస్సు డివైడర్ మీదకి దూసుకెళ్లకుండా బ్రేక్ వేసి బస్సును వెంటనే ఆపివేశాడు. దీంతో ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. కండక్టర్ జనగాం డిపోకు చెందిన బచ్చన్నపేట–జేబీఎస్ ఆర్టీసీ బస్సును ఆపి, ప్రయాణికులను అందులోకి ఎక్కించాడు. ఎండల తీవ్రత కారణంగా డ్రైవర్‌కు వడదెబ్బ తగిలి, కళ్లు తిరిగి ఉంటాయని ప్రయాణికులు తెలిపారు.
యాదగిరికొండపై
ఆర్టీసీ బస్సు బ్రేక్‌డౌన్
యాదగిరిగుట్ట: యాదగిరికొండపై ఆర్టీసీ బస్సు బ్రేక్‌డౌన్ అయింది. శుక్రవారం సాయంత్రం సమయంలో కొండ కింద నుంచి భక్తులను ఎక్కించుకొని కొండపైకి వస్తున్న సమయంలో స్వాగత తోరణం వద్ద బస్సు ఒక్కసారిగా నిలిచిపోయింది. దీంతో డ్రైవర్ అప్రమత్తమై బస్సు వెనక్కి వెళ్లకుండా జాగ్రత్త పడ్డాడు. దీంతో డిపోలోని గ్యారేజీలో ఉన్న మెకానిక్‌లు వచ్చి బస్సుకు మరమ్మతులు చేశారు.
● వాహనాన్ని వెంటనే పక్కకు
నిలిపివేయడంతో తప్పిన ప్రమాదం