
వాల్యుయేషన్ సెంటర్ ఏర్పాటు చేయనున్న భువనగిరి శివారులోని దివ్యబాల విద్యాలయం
భువనగిరి : పదో తరగతి వార్షిక పరీక్ష పేపర్లు ఇకపై జిల్లా కేంద్రంలోనే దిద్దనున్నారు. ఇందుకోసం జిల్లాకు స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ మంజూరైంది. దీన్ని భువనగిరిలోని దివ్యబాల విద్యాలయంలో ఏర్పాటు చేసేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఏటా మూల్యాంకనం కోసం ఉపాధ్యాయులు సుమారు వంద కిలో మీటర్ల దూరంలో ఉన్న నల్లగొండకు వెళ్లి వచ్చేవారు. ఇకపై ఆ ఇబ్బందులు తొలగనునున్నాయి.
గతంలో నల్లగొండలో..
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం నల్లగొండ పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్‌లో కొనసాగేది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు, రాజాపేట, బొమ్మలరామారం, తుర్కపల్లి మండలాల నుంచి దాదాపు 100 కి. మీ దూరంలో ఉన్న నల్లగొండకు వెళ్లాలంటే ఉపాధ్యాయులు ఆపసోపాలు పడేవారు. జవాబు పత్రాల సంఖ్య, బోధనలో కనీసం మూడేళ్ల అనుభవం అధారంగా పదో తరగతికి బోధించే అన్ని కేటగిరీల ప్రభుత్వ ఉపాధ్యాయులకు మూల్యాంకనం విధులు కేటాయిస్తారు. ఏటా జిల్లా నుంచి 250 నుంచి 300 వరకు ఉపాధ్యాయులు వెళ్లొచ్చేవారు. కరోనాకు ముందు 11 పేపర్లు ఉండేవి. ఎనిమిది నుంచి 10 రోజుల పాటు క్యాంప్ కొనసాగితే కొందరు తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడే ఉండేవారు. మరికొందరు వచ్చిపోయేవారు. ఇంకొందురు అనారోగ్య సమస్యలు ఇతర కారణాలు చూపుతూ విధులను ఉపసంహరించుకునే వారు.
ఏప్రిల్ 13 నుంచి 21వ తేదీ వరకు
మూల్యాంకనం
ఏప్రిల్ 3 నుంచి13వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఇదే నెల 13నుంచి 21వ తేదీ వరకు భువనగిరిలోని దివ్యబాల విద్యాలయంలో మూల్యాంకనం నిర్వహణకు విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. క్యాంప్ అధికారిగా డీఈఓ వ్యవహరించే అవకాశం ఉండగా మరొకరిని సహాయ క్యాంప్ అధికారిగా నియమించనున్నారు. సబ్జెక్టుకు ఒక్కరు చొప్పున సహాయ క్యాంపు, కోడింగ్ అధికారులను నియమించనున్నారు.ఎనిమిది మందికి ఒక్కరు చొప్పున చీఫ్ ఎగ్జామినర్ ఉంటారు. ఆయన మూల్యాంకనం జవాబు పత్రాలను పరిశీలిస్తారు. వీరి నియామకం కోసం జిల్లా విద్యాశాఖ అధికారులు కసరత్తు చేపట్టారు.
స్పాట్‌కు 300 మంది ఉపాధ్యాయులకు అవకాశం
గత సంవత్సరం పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల మూల్యాంకనాన్ని భువనగిరిలో నిర్వహించారు. దీంతో మూల్యాంకన నిర్వహణపై జిల్లా అధికారులకు అవగాహన ఏర్పడింది. సుమారు 300 మంది ఉపాధ్యాయులకు మూల్యాంకనం చేసే అవకాశం లభించనుంది.
భువనగిరిలో టెన్త్ స్పాట్ వాల్యుయేషన్ సెంటర్
ఫ దివ్యబాల విద్యాలయంలో ఏర్పాటుకు సన్నాహాలు
ఫ ఈ విద్యా సంవత్సరం నుంచే
ప్రారంభం
ఫ తగ్గనున్న దూరభారం..
ఉపాధ్యాయుల్లో హర్షం
ఏర్పాట్లు చేస్తున్నాం
గత సంవత్సరం పదో తరగతి సప్లిమెంటరీ పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనం భువనగిరిలో కొనసాగింది.ఆ అనుభవంతో కొత్తగా మంజూరైన వాల్యూయేషన్ సెంటర్‌లో మూల్యాంకన నిర్వహణ సులభంగా ఉండనుంది. ఉపాధ్యాయులకు దూరం భారం తగ్గనుంది. మూల్యాంకన కేంద్ర నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాం.
–కె.నారాయణరెడ్డి, డీఈఓ
