పెరటి కోళ్ల పెంపకంలో జాగ్రత్తలే కీలకం

ఇంటిలో పెంచుతున్న నాటు కోళ్లు
 - Sakshi

పెద్దవూర : వ్యవసాయం తరువాత పాడి పరిశ్రమ ఆ తర్వాత కోళ్ల పెంపకానిదే. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంట్లో నాటుకోళ్లను సాకుతారు. ఎవరైనా బంధువులు వచ్చినా, పండుగలకు, పబ్బాలకు ఇంట్లో పెంచుకున్న కోళ్లను కోసి ఆరగిస్తుంటారు. ప్రస్తుతం నాటుకోళ్ల ట్రెండు నడుస్తోంది. ఏటేటా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ సారి ఏప్రిల్‌, మే నెలల్లో ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వేడి పెరిగే కొద్ది కోళ్ల ఫారం యజమానులు, పెరటి కోళ్ల యజమానులు వాటి రక్షణలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ మాత్రం ఆలస్యం చేసినా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం లేకపోలేదు. ముఖ్యంగా వేసవిలో బద్దె పురుగు వ్యాధి ప్రభలుతుంది. ప్రమాదకర ఈ వ్యాధి నుంచి కోళ్లను రక్షించుకునేందుకు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని పెద్దవూర పశువైద్యాధికారి డాక్టర్‌ పిట్టల చంద్రబాబు సూచిస్తున్నారు.. వివరాలు ఆయన మాటల్లోనే..

బద్దె పురుగు ఇలా..

పరాన్న జీవులు రెండు రకాలు. అవి అంతర పరాన్న జీవులు, బాహ్యపరాన్న జీవులు. బద్దె పురుగుల వంటి అంతర పరాన్న జీవులు కోళ్ల పేగుల్లో నివసిస్తూ వాటి పోషక పదార్థాలను సుష్టిగా హరించి వేస్తూ, జీవాల్లో ఉత్పాదక శక్తిని తగ్గిస్తాయి. చివరకు వాటిని బలహీన పరిచి పెరుగుదల లేకుండా చేస్తాయి. బద్దె పురుగులు తెల్లగా సన్నటి రిబ్బను లాంటి శరీర సౌష్టవం కల్గి ఉంటాయి.

వ్యాధి సంక్రమించే విధానం

కొన్ని రకాల చీమలు, ఈగలు, మిడతలు, పేడపురుగు, నేలపై తిరిగే నత్తలు కోడి పెంటలోని బద్దె పురుగుల గుడ్లను తినడంతో వాటి లార్వాదశ ఈ కీటకాల్లో పెరుగుతుంది. కోళ్లు ఈ కీటకాలను తిన్నప్పుడు లార్వాదశ పేగుల్లో పెరిగి బద్దెపురుగులా మారుతాయి.

కలిగే హాని..

చిన్న వయస్సులో కోళ్లకు ఎక్కువగా ఈ బద్దె పురుగుల వ్యాధి సంక్రమిస్తుంది. వ్యాధి సోకిన కోళ్ల కాళ్లలో నిస్సత్తువ, పెరుగుదల లేకపోవడం, ఎక్కువ నీరు తాగడం, గుడ్ల ఉత్పత్తి తగ్గడం వంటి లక్షణాలు కన్పిస్తాయి. అతి చిన్న బద్దె పురుగులు పేగు గోడలలోనికి చొచ్చుకొని పోవడంతో రక్తస్రావం కలిగి కోళ్లు చనిపోతుంటాయి. మరి కొన్ని పేగులపై చిన్న చిన్న గడ్డలు ఏర్పరుస్తాయి. బద్దె పురుగులు ఎక్కువ సంఖ్యలో ఉండి పేగుల్లో అహార కదలికకు అడ్డుపడడమేకాక, వాటి ఒత్తిడితో పేగులు బద్దలై కోళ్లు చనిపోయే ప్రమాదం కూడా ఉంది. ఈ పురుగుల వలన రోగనిరోధక శక్తి తగ్గి ఇతర వ్యాధుల టీకాలు వేసినా సత్పలితాలు ఇవ్వకపోవచ్చు.

రోగ నిర్థారణ ఇలా..

కోళ్ల గుంపులో ఎదుగుదల లేకున్నా, గుడ్ల ఉత్పత్తి తగ్గినా బద్దెపురుగుల వ్యాధి ఉందని గ్రహించాలి. కోడిపెంటలో బద్దె పురుగుల శరీర ఖండాలు బియ్యపు గింజల్లాగా కనిపిస్తాయి. వ్యాధి నిర్ధారణకు ఒక కోడిని కోసి అందులోని పేగులను చూస్తే బద్దె పురుగులు కనిపిస్తాయి.

ఫ వేసవిలో వ్యాధులు సోకే అవకాశం

ఫ బద్దె పురుగు అత్యంత ప్రమాదకరం

ఫ వ్యాధి నిరోధక శక్తి, గుడ్ల ఉత్పత్తి,

పెరుగుదలపై ప్రభావం

ఫ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పెద్దవూర పశువైద్యాధికారి చంద్రబాబు సూచనలు

చికిత్స నివారణ చర్యలు..

ఈ వ్యాధి సోకితే కిలో బరువుగల కోడికి బ్యూటినోరెట్‌ 150 మిల్లి గ్రాములు, డైక్లోరోఫెన్‌ 200 గ్రాములు దాణాలో ఇవ్వాలి. మెబెండజోల్‌ ఫౌడర్‌ వంద కోళ్లకు 10 మి.గ్రా. చొప్పున దాణాలో ఇవ్వాలి. ఫెన్‌బెండజోల్‌, ఫ్రాజీక్వాంటాల్‌ వంటి ఇతర మందులను కూడా వాడవచ్చు. అలాగే కోళ్లు పెంచే ప్రాంతాల్లో కీటకాలు వ్యాప్తి చెందకుండా డెల్టామెత్రిన్‌ అనే మందు ద్రావణాన్ని నీటిలో కలిపి పిచికారీ చేయాలి. లేకపోతే ఫినాల్‌, సైథియాన్‌ వంటి క్రిమి సంహారక మందులను నీటిలో కలిపి కోళ్ల షెడ్డు లోపల చుట్టు పక్కల పిచికారీ చేయాలి.

Read latest Yadadri News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top