నా పేరు గజలక్ష్మి.. నాకూ భయాలున్నాయ్‌! | - | Sakshi
Sakshi News home page

నా పేరు గజలక్ష్మి.. నాకూ భయాలున్నాయ్‌!

Oct 4 2026 10:55 AM | Updated on Oct 4 2026 10:55 AM

ఖాకీలంటే పడదు ఆహారం.. ఆరోగ్యంపై శ్రద్ధ ఎక్కువ! స్వామివారి సేవలోనే సంతోషం

నా పేరు గజలక్ష్మి.. నా వయసు 54 ఏళ్లు. ఎక్కడ, ఎప్పుడు పుట్టానో తెలియదు. ఊహ తెలిసే నాటికే కర్ణాటకలోని సర్కస్‌ కంపెనీలో ఉన్నాను. 2004 మార్చిలో దాత శరణాల మాలతీరాణి నన్ను చినవెంకన్నకు బహుమతిగా అందించారు. అప్పటి నుంచి ఈ క్షేత్రమే నా ఇల్లు.. స్వామివారి సేవే నా జీవితం. ఇలా ద్వారకాతిరుమలతో 22 ఏళ్ల అనుబంధం ఏర్పడింది. హిందీతోపాటు తెలుగు కూడా కొంతవరకు అర్థం చేసుకోగలను. రోజూ వందలాది మంది భక్తులు నన్ను చూసి మురిసిపోతూ పలకరిస్తుంటారు. వారి ప్రేమాభిమానాలే నాకు ఆనందం.

ఏనుగునని.. నాకు భయం ఉండదని అనుకుంటారు. కానీ నేను కప్పలకు కూడా భయపడతాను. గుర్రాలు, కుక్కలు ఇతర జంతువులను చూస్తే కంగారుపడతాను. అన్నింటికంటే ఖాకీ రంగు దుస్తులంటే అస్సలు పడదు. మావటులు మినహా ఎవరైనా అలాంటి దుస్తులతో వస్తే కోపం వస్తుంది. 18 ఏళ్ల క్రితం ఆలయం వద్ద ఓ చిన్నారి నా కాళ్ల మధ్యకు వచ్చినా.. ఎలాంటి హాని చేయకుండా కాలితో పక్కకు నెట్టాను. అప్పుడు భక్తులందరూ నన్ను అభినందించారు. ఇక నిమిషానికోసారి తొండం, తోకతో ఒంటిపై వస్త్రాన్ని సరిచేసుకుంటుంటాను. అది చూసి నాకు సిగ్గెక్కువని చాలా మంది అనుకుంటుంటారు.

2009లో 15 రోజులు, ఈ ఏడాది జూలైలో ఐదు రోజులపాటు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాను. వైద్యులు చికిత్స అందించి కోలుకునేలా చేశారు. నా సంరక్షణకు ముగ్గురు మావటులు ఉన్నారు. వారు నా ఆరోగ్యం, ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతుంటారు. నేను శాఖాహారిని. రోజుకి 500 కిలోల వరకు ఆహారం తీసుకుంటాను. గరిక, చెరకు, బెల్లం, క్యారెట్లు, దోసకాయలు, కొబ్బరి మట్టలు, రావి ఆకులు ఇష్టంగా తింటాను. క్రిమిసంహారక మందుల పిచికారీ కారణంగా పామాయిల్‌ ఆకులను అందించడం మానేశారు. నా ఆహారం కోసం దేవస్థానం నెలకు రూ. 30 వేలకు పైగా ఖర్చు చేస్తోంది. రోజుకు 150 లీటర్లకు పైగా నీళ్లు తాగుతాను. ప్రతిరోజూ ఉదయం 6 నుంచి 9 గంటల వరకు కొండపై ఆరు కిలోమీటర్లు వాకింగ్‌ చేస్తాను. అనంతరం మావటులు స్నానం చేయించి ఆహారం అందిస్తారు. ఆకలేసినా, కప్పలు, కీటకాల వల్ల భయపడినా కాలికి కట్టిన గొలుసును తొండంతో పట్టుకుని నేలకేసి కొడతాను. ఆ శబ్దంతో మావటులు అప్రమత్తమై నా అవసరాన్ని గుర్తిస్తారు.

బ్రహ్మోత్సవాలు, ధనుర్మాసం, ఇతర పర్వదినాల్లో గ్రామోత్సవాల్లో స్వామివారి సేవలో పాల్గొంటాను. మావటులు ఎప్పుడూ నా వెంటే ఉంటూ కంటికి రెప్పలా చూసుకుంటారు. వారే నా సేవకులు.. బాడీగార్డులు కూడా!

ఇదే నా చిన్న విన్నపం..

నేను భారీగా కనిపించినా నాది చిన్నపిల్లల మనస్తత్వం. అడవిలో స్వేచ్ఛగా తిరగాల్సిన నేను.. ఇప్పుడు దైవసన్నిధిలో జీవిస్తున్నాను. మాలాంటి జంతువులను ప్రేమగా ఆదరిస్తూ.. మా అవసరాలు, భావాలను అర్థం చేసుకోండి. మమ్మల్ని కూడా మీలో ఒకరిగా చూడండి!

– ద్వారకాతిరుమల

చినవెంకన్న గజలక్ష్మి మనోగతం

మనుషుల్లాగే జంతువులకూ జీవించే హక్కు ఉంది. వాటిని ప్రేమగా ఆదరించాలి.. వాటి మనుగడకు భరోసా కల్పించాలి. ఆట వస్తువులుగా కాకుండా జీవులుగా చూడాలి. వాటి ఆహారం, ఆరోగ్యం, భద్రతతోపాటు సహజ జీవన పరిస్థితులను కాపాడాలి. జంతు సంరక్షణపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరం. అక్టోబర్‌ 4 ప్రపంచ జంతు దినోత్సవం సందర్భంగా ద్వారకాతిరుమల చినవెంకన్న దేవస్థానం గజలక్ష్మి తన మనసులోని మాటలను ఇలా పంచుకుంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement