దెందులూరు: అండర్–19 వెయిట్ లిఫ్టింగ్ 65 కేజీల విభాగం రాష్ట్రస్థాయి పోటీలకు దెందులూరులోని గారపాటి హైమావతి దేవి ఉన్నత పాఠశాల విద్యార్థి దాసరి వెంకటేష్ బాబు ఎంపికయ్యాడు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు వడ్లపట్ల విజయకుమార్, పీడీ తూంపాటి బాబురావు ఈ వివరాలు వెల్లడించారు. శనివారం ఏలూరులోని ఏఎస్‌ఆర్ స్టేడియంలో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో స్నాచ్ విభాగంలో 30 కేజీలు, క్లీన్ అండ్ జర్క్ విభాగంలో 40 కేజీలు... మొత్తం 70 కేజీల బరువు ఎత్తి వెంకటేష్ బాబు ఈ ప్రతిభ కనబరిచాడు. ఈ నెల 9, 10, 11 తేదీల్లో కాకినాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో ఈ విద్యార్థి ఏలూరు జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈ సందర్భంగా వెంకటేష్ బాబును పాఠశాల ప్రధానోపాధ్యాయులు వడ్లపట్ల విజయకుమార్, ఉపాధ్యాయులు అభినందించారు.
పాలకొల్లు సెంట్రల్: ముంబైకి చెందిన మహేందర్ 68 ఏళ్ల వయస్సులో దేశంలోని 12 జ్యోతిర్లింగాలతో పాటు పంచారామక్షేత్రాలను కూడా సైకిల్‌పై దర్శించుకోవాలని యాత్ర చేపట్టారు. సైకిల్ యాత్రలో భాగంగా శనివారం నరసాపురం వచ్చి క్షీరారామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడుతూ సైకిల్ యాత్రను మూడు నెలల క్రితం ప్రారంభించినట్లు తెలిపారు. ఇప్పటివరకు 5 వేల కిలోమీటర్లు ప్రయాణించగా ఇంకా 7 వేల కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉందని చెప్పారు. భీమవరంలోని సోమారామ (భీమేశ్వరస్వామి) దర్శనం తర్వాత శ్రీకాళహస్తి వెళ్లనున్నట్లు తెలిపారు. ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు.
ఇరగవరం: ఇనపర్రు గ్రామంలోని ముగ్గురమ్మల దేవాలయం సమీపంలో ఉన్న చిక్కాల కాలువ వద్ద గల్లంతైన కర్రి మోహన్‌రెడ్డి మృతదేహం శనివారం లభ్యమైంది. శుక్రవారం ఉదయం సుమారు 05:30 గంటలకు మోహన్ రెడ్డి తన స్నేహితులు పాడాల శివరెడ్డి, సట్టి చైతన్యరెడ్డి, బెతిరెడ్డి సాయి తిర్పారెడ్డిలతో కలిసి మార్నింగ్ వాక్‌కు వెళ్లాడు. సుమారు 7 గంటలకు మోహన్ రెడ్డి స్నేహితులు అతని తండ్రి వద్దకు వచ్చి, మోహన్ రెడ్డి ప్రకృతి అవసరాల నిమిత్తం కాలువ వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలువలో జారిపడినట్లు తెలిపారు. వెంటనే గ్రామస్తులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ, ఆచూకీ లభించలేదు. అనంతరం పోలీసుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టగా శనివారం మోహన్‌రెడ్డి మృతదేహం లభ్యమైంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
శ్రీవారి నిత్యాన్నదానానికి రూ.1.11 లక్షల విరాళం
ద్వారకాతిరుమల: శ్రీవారి శాశ్వత నిత్యాన్నదాన పథకానికి రాజమండ్రికి చెందిన భక్తుడు సీహెచ్ నాగ వీరవెంకట సుబ్బారావు శనివారం రూ.1,11,200 విరాళంగా అందజేశారు. ఈ విరాళాన్ని ఆలయ కార్యాలయంలో జమ చేయగా, దాతకు ఆలయ ఏఈఓ పి.నటరాజారావు విరాళం బాండ్‌ను అందజేశారు. ముందుగా ఆయన కుటుంబ సమేతంగా స్వామి, అమ్మవార్లను దర్శించారు.


