సచివాలయ ఉద్యోగుల సంఘ రాష్ట్ర కన్వీనర్‌గా కిరణ్‌కుమార్‌ | - | Sakshi
Sakshi News home page

సచివాలయ ఉద్యోగుల సంఘ రాష్ట్ర కన్వీనర్‌గా కిరణ్‌కుమార్‌

Sep 16 2026 8:46 AM | Updated on Sep 16 2026 8:46 AM

సచివాలయ ఉద్యోగుల సంఘ రాష్ట్ర కన్వీనర్‌గా కిరణ్‌కుమార్‌ పారదర్శకంగా ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పంపిణీ 29న ఎస్‌ఎంసీ ఎన్నికలు ఫీల్డ్‌ సిబ్బంది సమస్యలను పరిష్కరించాలి అవకతవకలపై విచారణ

నరసాపురం: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల డెమోక్రటిక్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కన్వీనర్‌గా నరసాపురం వార్డు సచివాలయ ఉద్యోగి జి.కిరణ్‌కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయవాడలో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు జి.జోసఫ్‌ కిషోర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ ఎన్నిక నిర్వహించారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపిన కిరణ్‌కుమార్‌, సచివాలయ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు. నూతన కన్వీనర్‌గా ఎన్నికై న ఆయనను నరసాపురం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు అభినందించారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకం పంపిణీ ప్రక్రియను అధికారులు, గ్యాస్‌ ఏజెన్సీల ప్రతినిధులు సమన్వయంతో పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కె.ఆర్‌. కల్పశ్రీ ఆదేశించారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ సమావేశ మందిరంలో సిలిండర్ల బుకింగ్‌, డెలివరీ, లబ్ధిదారుల ఖాతాల్లో సబ్సిడీ జమ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం పథకాన్ని అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సకాలంలో అందజేయాలన్నారు. పథకం నిబంధనలు, బుకింగ్‌, డెలివరీ విధానాలపై సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలని, పంపిణీలో జాప్యం లేదా ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి ఎన్‌. సరోజ, సీఎస్‌డీటీలు, ఆర్‌ఐలు, జిల్లా గ్యాస్‌ ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.

భీమవరం: జిల్లాలోని పాఠశాల యాజమాన్య కమిటీల కాలపరిమితి ముగియడంతో నూతన కమిటీల ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఒ.అనిల్‌ కుమార్‌ మంగళవారం విలేకరులకు తెలిపారు. జిల్లాలోని 1,398 ప్రభుత్వ పాఠశాలలకుగాను మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ నెల 18న ఓటర్ల జాబితా ప్రదర్శన, 25న మధ్యాహ్నం 1 గంట వరకు అభ్యంతరాల స్వీకరణ, అదే రోజు సాయంత్రం 4 గంటలకు తుది జాబితా విడుదల చేస్తామన్నారు. 29న ఎన్నికలు నిర్వహించి, అనంతరం తొలి ఎస్‌ఎంసీ సమావేశం ఏర్పాటు చేస్తామని వివరించారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా 100 లోపు ఉన్న చోట 12 మంది, 100 నుంచి 500 వరకు 15 మంది, 500 కంటే ఎక్కువ మంది ఉంటే 20 మంది సభ్యులతో కమిటీలు ఎన్నికవుతాయని తెలిపారు.

భీమవరం: వైద్య, ఆరోగ్య శాఖలో ఫీల్డ్‌ స్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వై. మోహనరావు, కార్యదర్శి జి. జక్రయ్య మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. నిబంధనల ప్రకారం అదనపు హెచ్‌ఆర్‌ఏ, యూనిఫామ్‌ అలవెన్సులు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఎల్సీడీసీ సర్వేలో భాగంగా ఫీల్డ్‌ సిబ్బంది ఇప్పటికే ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించారని, అయితే అభా ఐడీల కోసం మళ్లీ అదే కుటుంబాలను సంప్రదించి ఓటీపీలు సేకరించాల్సి రావడం వల్ల సిబ్బందికి, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల పనుల్లో జాప్యం జరిగి ప్రజల్లో అసహనం పెరుగుతోందని తెలిపారు. కాబట్టి, ఇప్పటికే అందుబాటులో ఉన్న ప్రభుత్వ డేటాబేస్‌ నుంచే అభా ఐడీ వివరాలను వినియోగించుకోవాలని కోరారు.

చింతలపూడి: మండల పరిధిలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మత్తులలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఉన్నతస్థాయి విచారణ ప్రారంభమైంది. బాధితుల ఫిర్యాదుల మేరకు విశాఖపట్నంలోని ఏపీఈపీడీసీఎల్‌ సీఎండీ కార్యాలయ జనరల్‌ మేనేజర్‌ జానకిరాణి నేతృత్వంలోని అధికారుల బృందం మంగళవారం స్థానిక ఏడీఈ కార్యాలయంలో విచారణ చేపట్టింది. బాధిత రైతుల నుంచి లిఖితపూర్వక వాంగ్మూలాలు, ఆధారాలను సేకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement