ప్రైవేటు వేసేదెవరు? | - | Sakshi
Sakshi News home page

ప్రైవేటు వేసేదెవరు?

May 30 2026 8:47 AM | Updated on May 30 2026 8:47 AM

ప్రైవేటు వేసేదెవరు?

టాప్‌ విద్యాసంస్థల తీరు అంతే

భీమవరం: జిల్లాలో విద్యాశాఖ తీరు నవ్విపోదురుగాక నాకేంటి అనేతీరులో ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థలు నిబంధనలకు విరుద్ధంగా విద్యా వ్యాపారం జోరుగా చేస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని అనేక ప్రాధమిక, ఉన్నత పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలకు ఎటువంటి అనుమతులు లేకున్నా జోరుగా అడ్మిషన్స్‌ చేస్తున్నా పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. భీమవరం పట్టణం, మండల పరిధిలో 48 ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలలకుగాను 25 పాఠశాలలకు అనుమతులు లేవంటే జిల్లా వ్యాప్తంగా వందలాది స్కూల్స్‌ అనుమతులు లేకుండానే తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నా విద్యాశాఖ మొద్ద నిద్ర నటిస్తోందనే చెప్పాలి. జూన్‌ నెలలో నూతన విద్యాసంవత్సరం ప్రారంభం కానున్న నేపద్యంలో ప్రైవేట్‌ విద్యాసంస్థలు లక్షలాధి ఫీజులు వసూలు చేయడమేగాక బుక్స్‌, యూనిఫామ్‌ తదితర విద్యాసామాగ్రి తమ వద్దనే కొనుగోలుచేయాలనే నిబంధనలతో విద్యార్థుల తల్లిదండ్రులను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారు. విద్యార్ధి సంఘాల నాయకులు బుక్స్‌, యూనిఫామ్స్‌ అమ్మకాలు చేసే విద్యాసంస్థల వద్ద ఆందోళనలు చేయడం విద్యాశాఖాధికారులు మొక్కుబడిగా ఆయా స్కూల్స్‌కు నోటీసులు ఇవ్వడం మినహా వాటిని కఠిన చర్యలు తీసుకున్న దాఖాలాలు లేవు.

నిబంధనలకు విరుద్ధంగా తరగతులు

ప్రైవేట్‌ విద్యాసంస్థలు విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందుగానే అన్నిఅనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా క్రీడాప్రాంగణాలు, అగ్నిప్రమాదాలు సంబంధించినపుడు తీసుకునే చర్యలకుగాను అగ్నిమాపకశాఖ నుంచి ఎన్‌ఓసీ వంటివి తప్పనిసరి. అంతేగాకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం సమయపాలన పాటించాల్సి ఉంటుంది. అయితే దాదాపు అన్ని ప్రైవేట్‌ విద్యాసంస్థలు ఉదయం 6 గంటలకే తరగతులు ప్రారంభించి రాత్రి 8 గంటల వరకు విద్యార్థులను పీల్చి పిప్పి చేస్తున్నారు. ఇక టెన్త్‌, ఇంటర్‌ విద్యార్థులు పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. తమ విద్యాసంస్థ మొదటి స్థానంలో ఉండాలనే కాంక్షతో విద్యార్థులకు కనీసం వేసవి సెలవులు కూడా ఇవ్వకుండా తరగతులు నిర్వహిస్తున్నా పట్టించుకోవడం లేదు. మండువేసవిలో కొన్ని విద్యాసంస్థల బస్సుల్లో విద్యార్థులను తరలిస్తున్నా అవి జిల్లాస్థాయి ఉన్నతాధికారుల కళ్ల ఎదుటే తిరుగుతున్నా జంకు లేకుండా తరగతులు నిర్వహిస్తున్నారు.

జిల్లాలో అనుమతులు లేని వందలాది ప్రైవేట్‌ విద్యా సంస్థలు

ఆయా స్కూల్స్‌లో జోరుగా అడ్మిషన్స్‌

నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న విద్యాశాఖ

నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్న విద్యాసంస్థల్లో కొంతమంది అధికారులు అవగాహన తరగతులు నిర్వహించడం విశేషం. పట్టణంలోని పేరొందిన భాష్యం, నారాయణ, గీతమ్స్‌, సీవీ రామన్‌, శ్రీచైతన్య వంటి ఎల్‌కేజీ, యూకేజీ స్కూల్స్‌కు అనుమతులు లేవని అలాంటి వాటిలో విద్యార్థులను చేర్చే ముందు తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ భీమవరం విద్యాశాఖాధికారి–1 ఎన్‌.శ్రీనివాసరావు అప్రమత్తం చేశారంటే ప్రైవేటు విద్యాసంస్థల పరిస్థితి ఏవిధంగా ఉందో అవగతమవుతోంది. ఇప్పటికే అనుమతులులేని ప్రైవేట్‌ విద్యాసంస్థలు గత రెండు నెలలకుపైగా అడ్మిషన్స్‌ స్వీకరిస్తున్నా విద్యాశాఖ ఎందుకు అడ్డుకోవడం లేదని విద్యార్థులు తల్లిదండ్రుఉలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా నిబంధనలు మీరుతున్న విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement