నూజివీడు: మొక్కలకు కావాల్సిన పోషకాలను మొక్కలు భూమి నుంచి గ్రహిస్తాయనే విషయం అందరికి తెలిసిందే. అయితే భూముల్లో పోషకాల లోపం ఉంటే వాటి భర్తీకి రసాయనిక ఎరువులను రైతులు అవసరానికి మించి వాడుతున్నారు. దీనివల్ల అన్నదాతలకు పెట్టుబడులు విపరీతంగా పెరుగుతున్నాయి. సన్న, చిన్నకారు రైతులు పంటలు పండించేటప్పుడు కొన్ని పోషకాలను అధికంగా ఇవ్వడం, మరికొన్ని పోషకాలు తక్కువగా ఇవ్వడం వల్ల పోషక లభ్యతలో సమతుల్యత లేక పంటల ఉత్పాదకత తగ్గిపోతోంది. అలాగే రసాయన ఎరువులను అవసరానికి మంచి వాడడంతో భూములు పంటల సాగుకు పనికి రాకుండాపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతులు రసాయన ఎరువులను తగ్గించి, సేంద్రియ ఎరువులను వాడాలని నూజివీడు ఏడీఏ జొన్నలగడ్డ భవాని సూచిస్తున్నారు. ఆమె రైతులకు పలు సూచనలు, సలహాలు అందజేస్తున్నారు.
సేంద్రియ ఎరువుల్లో పచ్చిరొట్ట ఎరువులు
● పచ్చిరొట్ట విత్తనాలను పొలంలో చల్లుకుని పంట పూత దశలో భూమిలోనే కలియదున్నాలి. ఇలా చేయడం వల్ల 30 నుంచి 35 శాతం వరకు నత్రజని ఎరువుల వాడకాన్ని తగ్గించవచ్చు.
● ఖరీఫ్ పంటకు ముందు వర్షాకాలంలో పచ్చిరొట్ట ఎరువులను సాగుచేసుకోవాలి. జీలుగ, జనుము, అలసంద, పిల్లిపెసర, పెసర తదితర పచ్చిరొట్ట ఎరువులు బాగా ఉపయోగపడతాయి.
● వ్యవసాయశాఖ 50 శాతం రాయితీపై రైతులకు పచ్చిరొట్ట విత్తనాలను అందిస్తోంది. వీటిని ఖరీఫ్ సాగుకు కొద్దిరోజుల ముందే చిరుజల్లులు పడే సమయంలో పొలాల్లో చల్లుకోవాలి.
● జనుము, పిల్లిపెసరను పశువులకు మేపవచ్చు. ఆ తరువాత భూమిలో కలిపి దున్నుకోవాలి. జీలుగ అయితే పశువులు మేయవు కాబట్టి పూత దశ ముందు వరకు నేలలో కలిపి దున్నాలి.
● వరి నాట్లు వేయడానికి కనీసం 20రోజులు ముందే నేలలో కలిపి దున్నినట్లయితే నాట్లు వేసే సమయానికి భూమిలో కుళ్లి సేంద్రియ ఎరువుగా మారి పంటకు ఉపయోగపడుతుంది.
సేంద్రియ ఎరువుల వల్ల లాభాలు
నేలలో నీటిని పట్టి ఉంచే గుణం పెరుగుతుంది. భూసారం పెరగడంతోపాటు వివిధ పోషకాల మార్పిడి చెందే శక్తి నెలలో పెరుగుతుంది. మొక్కలకు చీడపీడలను తట్టుకునే శక్తి పెరుగుతుంది. నేలలో సూక్ష్మజీవులు వృద్ధి చెంది సుస్థిర దిగుబడులు సాధించడానికి ఉపయోగపడతాయి. దిగుబడులు కూడా పెరుగుతాయి. నేలలో కాలుష్యం తగ్గుతుంది. జీలుగను భూమిలో కలిపి దున్నడం వల్ల చౌడుశాతం కూడా తగ్గుతుంది. భూమిలో సత్తువ పెరగడమే కాకుండా పంట సాగు కూడా ఆశాజనకంగా ఉంటుంది. కాబట్టి ప్రతిరైతూ పచ్చిరొట్ట పైర్లను సాగుచేసి రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించుకుంటే సాగులో పెట్టుబడులు తగ్గడమే కాకుండా నాణ్యమైన దిగుబడులు సాధించడం ద్వారా వ్యవసాయం లాభసాటిగా మారుతుంది.


