భీమవరం: భీమవరం డీఎన్నార్ అటానమస్ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన జాతీయ స్థాయి యూనివర్శిటీ కామన్ ఎంట్రన్స్ పరీక్ష (సీయూఈటీ)కు హాజరైన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. జిల్లా వ్యాప్తంగా భీమవరం ఒక్కటే పరీక్షా కేంద్రం కావడం, 140 మంది విద్యార్థులను కేటాయించడం పరీక్షా కేంద్రంలో విద్యుత్ సరఫరా సక్రమంగా లేక పోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమై 6 గంటలకు ముగియాల్సి ఉండగా 8.30 గంటలకు పూర్తికాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందారు. పరీక్ష నిర్వహణకు డీఎన్నార్ కళాశాల యాజమాన్యం 2 ల్యాబ్‌లను కేటాయించగా ఒక ల్యాబ్‌లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో విద్యార్థులందరినీ ఒకే ల్యాబ్‌లో పరీక్ష రాయించడం వల్లనే సమస్య ఏర్పడిందని చెబుతున్నారు. అయితే పరీక్షకు హాజరైన విద్యార్థులు మాత్రం సర్వర్ సక్రమంగా పనిచేయకపోవడం, మధ్యలోనే సిస్టం ఆగిపోవడం, విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వంటి ఇబ్బందులు ఏర్పడినా పట్టించుకునే నాథుడు లేడని ఆందోళన వ్యక్తం చేశారు. దూర ప్రాంతాల నుంచి పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు పరీక్షా కేంద్రం బయట దోమలు, ఉక్కబోతతో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.
చాట్రాయి: వడ దెబ్బ తగిలి వృద్ధుడు మృతి చెందిన సంఘటన మండలంలోని జనార్థనవరంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కంచల నాగులు(80) శుక్రవారం ఇంట్లో ఉండగా వాంతులు రావడంతో వడదెబ్బతగిలి మృతి చెందాడు. మృతుడికి కొడుకు ఉన్నారు.
గుడివాకలంకలో..
దెందులూరు: ఏలూరు రూరల్ మండలం గుడివాకలంక వైఎస్సార్‌సీపీ నాయకుడు ముంగర అంతర్వేది (40) వడదెబ్బతో శుక్రవారం మృతి చెందారు. ఆయనకు భార్య కూతురు, కొడుకు ఉన్నారు. ఆయన మృతిపై వైఎస్సార్ సీపీ నాయకులు సంతాపం తెలిపారు.
జంగారెడ్డిగూడెం: డ్రైనేజీలో పడి ఒక వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై ఎన్‌వీ ప్రసాద్ శుక్రవారం విలేకరులకు తెలిపారు. స్థానిక వెటర్నరీ ఆసుపత్రి సమీపంలో నివసిస్తున్న జాజి సింగారయ్య (40) సెంట్రింగ్ పని చేసుకుని జీవిస్తున్నారు. అయితే 28న రాత్రి పనిమీద బయటకు వెళ్తున్నానని చెప్పి తిరిగి ఇంటికి రాలేదు. అయి తే ఉదయం చూసే సరికి సమీపంలో డ్రెయినేజీలో పడి మృతి చెందినట్లు స్థానికులు గుర్తించారు. దీంతో కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై సింగారయ్య సోదరి కోన వరలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.


