ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభానికి సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రతి ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు రవాణా శాఖ సూచించిన భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా బస్సులను సిద్ధం చేయాలని ఉప రవాణా కమిషనర్ షేక్ కరీమ్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీన జిల్లా పోలీస్ శాఖ, రవాణా శాఖ సంయుక్తంగా ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలతో నిర్వహించిన సదస్సులో అధికారులు పేర్కొన్న బస్సుల్లో వీఎల్‌టీడీని, డ్యాష్ బోర్డు కెమెరాలు అమర్చడం, పోలీస్ శాక కేటాయించిన క్యూఆర్ కోడ్ కలిగిన పోస్టర్లను ప్రతి స్కూల్ బస్సు ముందు, వెనుక భాగాల్లో అతికించడం, 60 సంవత్సరాల వయస్సు మించని, అనుభవం కలిగి ఉన్న డ్రైవర్లను నియమించడం, బ్రీత్ అనలైజర్లను ఏర్పాటు చేసుకోవడం, రవాణా శాఖ అధికారులు అందించిన చెక్ లిస్టులో పేర్కొన్న భద్రతా ప్రమాణాలను పాటిస్తూ విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రమాదాల నివారణకు సహకరించాలన్నారు. రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఏలూరు జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీ అధికారులతో కూడిన 5 తనిఖీ బృందాలు ఈ నెల 1 నుంచి అన్ని ప్రైవేటు విద్యాసంస్థల పాఠశాలలు, కళాశాలల బస్సుల ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నామని, దీనిలో భాగంగా ఇప్పటి వరకు 841 బస్సులను తనిఖీ చేసి, బస్సుల్లో భద్రతా ప్రమాణాలు సరిగా లేని 652 బస్సుల యాజమాన్యాలకు నోటీసులు అందించామన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు వారి బస్సుల్లోని లోపాలను సరిచేసుకుని, బస్సులకు ఏటీఎస్ ద్వారా ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందాలని, లేని పక్షంలో కేసులు నమోదు చేయడంతో పాటు బస్సులను సీజ్ చేస్తామని డీటీసీ కరీమ్ హెచ్చరించారు.
దెందులూరు: మండలంలోని ఉండ్రాజవరం బస్టాండ్ సమీపంలో శుక్రవారం ట్రాక్టర్ ఢీకొని ఓ ద్విచక్ర వాహనదారుడు మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దెందులూరు మండలం దోసపాడు గ్రామానికి చెందిన పంతగాని రాజేష్ (25) మోటార్ సైకిల్‌పై శుక్రవారం పోతునూరు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఉండ్రాజవరం బస్టాండ్ సమీపంలోకి వచ్చేసరికి ఓ ట్రాక్టర్ అదుపుతప్పి రాజేష్‌ను ఢీకొట్టింది. దీంతో రాజేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు అవివాహితుడు కాగా తల్లిదండ్రులు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సంఘటనా స్థలం వద్ద రోదిస్తున్న మృతుడి బంధువులు, రాజేష్ (ఫైల్)


