ఆగిరిపల్లి: తోటపల్లిలో నిర్మిస్తున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు వలన మా జీవనోపాధి దెబ్బతింటుందని అధికారుల ముందు గ్రామాలకు చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం తోటపల్లిలో బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేసే చింతగట్టు వద్ద తోటపల్లి, చిన్నాగిరి పల్లి, సింగన్నగూడెం, సర్నాల గొల్లగూడెంకి చెందిన గ్రామస్తులతో అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ చుట్టుపక్కల గ్రామాలకు చెందిన అనేక కుటుంబాలకు చెందినవారు ఎన్నో సంవత్సరాలుగా చింతగట్టుపై పశువులను మేపుకుంటూ జీవనం సాగిస్తున్నామని, గతంలో హైకోర్టు కూడా తమకు అనుకూలమైన తీర్పు వెలువరించిందని, ఇప్పుడు బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే పశువులకు పశుగ్రాసం లేక జీవనోపాధి కోల్పోతామని 2/1 సర్వే నెంబర్ లో ఇంకా 500 ఎకరాలు ఖాళీ స్థలం ఉందని ప్రభుత్వం బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన స్థలం అక్కడ ఏర్పాటు చేయాలని అధికారులను డిమాండ్ చేశారు.
పర్యావరణానికి హాని
బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు పేరుతో కొండను ధ్వంసం చేస్తే పర్యావరణానికి హాని కలుగుతుందని గ్రామస్తులు అధికారులకు తెలిపారు. ప్రభుత్వం, అధికారులు న్యాయం చేయకపోతే అవసరమైతే కోర్టుకి వెళ్లి అయినా సరే న్యాయం కోసం పోరాడుతామని తేల్చి చెప్పారు. జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ వెంకట్రావు మాట్లాడుతూ బయో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేయడం వల్ల చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న రైతులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. బయో గ్యాస్ ప్లాంట్ వల్ల పర్యావరణానికి ఎటువంటి హాని జరగదని తెలిపారు. మంత్రి కొలుసు పార్థసారథి కుమారుడు నితిన్ కృష్ణ మాట్లాడుతూ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేయడం వల్ల యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. జిల్లా పరిశ్రమల చీఫ్ ఇన్‌స్పెక్టర్ కృష్ణమూర్తి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏఎస్‌ఆర్‌సీ మూర్తి, మండల వ్యవసాయ అధికారి భవాని, డిప్యూటీ ఎంపీడీఓ దుర్గారావు పాల్గొన్నారు.


