భయంతో పట్టుబడులు చేయొద్దు | - | Sakshi
Sakshi News home page

భయంతో పట్టుబడులు చేయొద్దు

May 24 2026 1:21 AM | Updated on May 24 2026 1:21 AM

భయంతో పట్టుబడులు చేయొద్దు

పాలకొల్లు సెంట్రల్‌: ఆక్వా రైతులకు జరుగుతున్న అన్యాయంపై రైతుల్లో పెను మార్పు వచ్చిందనడానికి మొన్న జరిగిన నిరసన కార్యక్రమమే నిదర్శనమని, ఈ నిరసన ప్రభుత్వానికి ఒక హెచ్చరిక అని జై భారత్‌ క్షీరారామ ఆక్వా సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్‌రాజు అన్నారు. శనివారం పూలపల్లిలో జై భారత్‌ క్షీరారామ ఆక్వా సంఘం ఆధ్వర్యంలో విలేకర్ల సమావేశం ఏర్పాటుచేశారు. ఫీడ్‌ కంపెనీలు, ప్రాసెసింగ్‌ యూనిట్లు దిగి వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే, తమ ఉద్యమం మరింత ఉగ్రరూపం దాల్చుతుందని హెచ్చరించారు. ఫీడ్‌, ప్రాసెసింగ్‌ యూనిట్లు ఆక్వా రైతులను దోచుకోవాలనే దుర్భుద్ధితోనే ఉన్నాయని ఆరోపించారు. తాము తమ సమస్యల కోసం పోరాటం చేస్తుంటే, కొందరు రైతులు తమ సరుకు పట్టుబడి దశకు చేరుకుందని ప్రాసెసింగ్‌ యూనిట్లను ఆశ్రయిస్తున్నారని, దానికి వారు ఉన్న ధర కంటే మరింత తక్కువ అడుగుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం రూ. 230 ఉన్న ధరను, పట్టుబడి చేసే రైతులను భయపెట్టి మరో రూ. 10 నుంచి రూ. 20 తగ్గించి అడుగుతున్నారని, ధరలు ఇంకా తగ్గిపోతాయని రైతులను భయాందోళనకు గురిచేస్తున్నారని గుర్తుచేశారు. ఏదైనా కారణం చేత వైరస్‌ బారిన పడిన సరుకును మాత్రమే రైతులు పట్టుబడి చేసుకోవాలని, ధరలు తగ్గిపోతాయనే భయంతో సాగు బాగున్న రైతులు పట్టుబడులు చేయవద్దని సూచించారు. ఈ నెల 29న అమలాపురంలో రాష్ట్రస్థాయి ఆక్వా సంఘం సర్వసభ్య సమావేశంలో తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మేడిది జాన్‌రాజు, మేకా ఫణీంద్ర కుమార్‌, పెన్మెత్స వెంకట సత్యనారాయణరాజు, సోంబాబు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement