కలిదిండి(కై కలూరు): ఇద్దరు ఆడ పిల్లలకు తల్లి ప్రేమ కరువైందని కువైట్‌లో చిక్కుకున్న తన భార్యను ప్రభుత్వం చొరవ తీసుకుని తిరిగి పంపించే ఏర్పాట్లు చేయాలని కలిదిండి మండలం కలిదిండి ఇందిరా కాలనీకి చెందిన బండి వెంకన్న వేడుకుంటున్నాడు. వెంకన్న భార్య ప్రశాంతి పొట్టకూటి కోసం మూడేళ్ల క్రితం కువైట్ వెళ్లిది. ఆమె కువైట్‌లో ఉండగానే ప్రశాంతి తల్లిదండ్రులు మరణించిన కడచూపుకు నోచుకోలేకపోయింది. బిడ్డల కోసం తిరిగి భారత్ రావడానికి శత విధాలా ప్రయత్నిస్తున్నా ఫలితం దక్కడం లేదు.
అసలేం జరిగిందంటే..?
ప్రశాంతి ఓ కాంట్రాక్టరు ద్వారా మూడేళ్ల క్రితం కువైట్ వెళ్లింది. రెండేళ్లు ఎగ్రిమెంటుపై కువైట్‌లో ఓ కుటుంబంలో పనికి కుదిరింది. ప్రతినెలా డబ్బులు కలిదిండిలో భర్త వెంకన్నకు పంపుతోంది. రెండేళ్లు పూర్తయిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్తానని ఆమె యజమానులను కోరితే అందుకు నిరాకరించారు. పాస్‌పోర్టు ఇవ్వలేదు కానీ, తిరిగి ప్రశాంతిపై దొంగతనం నెపం ఆరోపించారు. చివరకు కువైట్ పోలీసులు విచారణ చేసి ప్రశాంతి తప్పు లేదని తేల్చారు. ప్రస్తుతం ఆమెకు భారత్ ఎంబసీలో ఆశ్రయం కల్పించారు. ఇదిలా ఉంటే దక్షిణాసియాలో యుద్ధం కారణంగా ఆమె ప్రయాణానికి ఆటంకం ఏర్పడింది. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడ్డాయని తన భార్యను ఇండియాకు పంపించేలా చర్యలు తీసుకోవాలని భర్త వెంకన్న కోరుతున్నాడు.


