జంగారెడ్డిగూడెం: గోకుల తిరుమల పారిజాతగిరి వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం 8 గంటలకు నిత్య హోమం, నీరాజనం, తీర్థప్రసాద గోష్టి తదితర పూజలు వైభవంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించుకున్నారు. పొణంకి సత్య పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు, ఋషి కేష్, కుమార్, రాఘవ ఆచార్యులు దాతలు బుద్దాల నాగు, కృష్ణవేణి దంపతులు, జెట్టిబోయిన సత్యనారాయణ, వసుంధర కుటుంబం సభ్యులను సన్మానించారు. అనంతరం అన్నప్రసాద వితరణ, సాయంత్రం 4 గంటల నుంచి గరుడ వాహనంపై శ్రీస్వామి వారు జంగారెడ్డిగూడెం పుర వీధులలో రథపై బయలుదేరారు. భక్తి కోలాటం, సన్నాయి మేళం, దేవతమూర్తులు వేషధారణతో పట్టణంలో సుబ్బంపేటరోడ్, రాజేశ్వరి థియేటర్ రోడ్, గంగానమ్మ గుడి, పాత బస్టాండ్ నుంచి బోస్ బొమ్మ సెంటర్, కొత్త బస్టాండ్, అక్కడ నుంచి కాకర్ల కాంప్లెక్స్ రోడ్, కాలేజ్ అడ్డరోడ్, బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీస్, తిరిగి పారిజాతగిరి ఆలయం వరకు గ్రామోత్సవం నిర్వహించారు. కార్యక్రమాలను ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అల్లూరి రామకృష్ణ, ఆలయ కార్యనిర్వాహణ అధికారి కలగర శ్రీనివాస్ పర్యవేక్షించారు. ఈ నెల 14వ తేదీ గురువారం ఉదయం ఆలయంలోని శ్రీస్వామివారి పుష్కరిణిలో చక్రస్నానం ఉంటుందని ఈవో తెలిపారు.


